కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నారా? కాంగ్రెస్ పార్టీని వీడితే ఆయన ఏ పార్టీలో చేరతారు? జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ అధిష్టానం, శశి థరూర్ మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల శశిథరూర్ ప్రధాని నరేంద్ర మోదీని మెచ్చుకోవడమే దీనికి కారణమన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి వివరణ కూడా ఇచ్చుకున్నారు.
ఈ నేపథ్యంలోనే శశిథరూర్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫొటో.. ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చేలా ఉంది. కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత పీయూష్ గోయల్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో శశి థరూర్ షేర్ చేశారు. ఈ ఫొటోలో బ్రిటీష్ ట్రేడ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జొనాథన్ రెనాల్డ్స్ కూడా ఉన్నారు. ఈ పొటోతో శశి థరూర్ రాజకీయ భవితవ్యానికి సంబంధించిన ఊహాగానాలు జోరందుకున్నాయి. శశి థరూర్ బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. పార్టీలో తన పాత్ర ఏంటో స్పష్టం చేయాలని శశి థరూర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కోరారు. అయితే, రాహుల్ గాంధీతో జరిగిన చర్చల్లో ఈ విషయంలో శశి థరూర్‌కి స్పష్టత రాలేదని తెలుస్తోంది. తాను పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని.. వద్దు అనుకుంటే తనకు ప్రత్యామ్నాయం కూడా ఉందంటూ శశి థరూర్ రెండ్రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు.
అయితే ప్రధాని మోదీ అమెరికా పర్యటనను మెచ్చుకోవడంతో పాటు.. కేరళలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ థరూర్ వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. తాజా పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనన్న అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఎంపీ శశి థరూర్ వరుసగా నాలుగు సార్లు కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కోసం పట్టుబడుతూ 2022 అక్టోబర్‌లో జరిగిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో శశి థరూర్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గేపై పోటీ చేసి ఆయన ఓడిపోయారు. గాంధీ కుటుంబం మద్దతుతో ఆ ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గేకు 7,897 ఓట్లు రాగా.. గాంధీ కుటుంబం మద్దతు లేకున్నా.. ఒంటరిగా శశి థరూర్ 1,072 ఓట్లు సాధించారు.