పాక్ ఉగ్రవాద కార్యకలాపాలకు భారత్ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగలడంతో పాకిస్తాన్ పూర్తిగా నిరాశకు గురవుతోంది. ఉగ్రవాదాన్ని తోడుగా పెట్టుకొని భారత్ సరిహద్దుల్లోని గ్రామాలపై, భారత ఆర్మీపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు చేసే ప్రయత్నాలు చేస్తోంది. అయితే, భారత సైన్యం మొదటి నుంచి సన్నద్ధంగా ఉండి పాక్ చర్యలకు సమర్థంగా ప్రతిస్పందిస్తూ పెద్ద ఎత్తున ఆస్తినష్టం కలిగించడమే కాదు, పాక్ ప్రభుత్వ ఆత్మవిశ్వాసంపైనా దెబ్బ కొడుతోంది. దేశవ్యాప్తంగా ఈ సైనిక చర్యలకు ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-RSS కూడా భారత సైన్యానికి మద్దతు తెలిపింది.
ప్రతి పౌరుడు దేశభక్తిని ప్రదర్శించాల్సిన సమయం ఇదేనని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్నారు. సాయుధ దళాలకు అవసరమైన ప్రతి సందర్భంలో సహాయపడాలని, స్థానిక అధికార యంత్రాంగంతో కలిసి పనిచేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ ఐక్యతకు, భద్రతకు అందరూ తమ వంతు బాధ్యతగా చేయాలని సూచించారు.
గడచిన రెండు రోజులుగా పాక్ దుశ్చర్యలను అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఎండగడుతూ, మరోవైపు ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత ఆర్మీ చేపట్టిన కౌంటర్ చర్యలను మోహన్ భగవత్ ప్రశంసించారు. పాక్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదానికి చెక్ పెడుతూ, పహల్గామ్ దాడిలో బలైపోయిన కుటుంబాలకు ఈ చర్యల ద్వారా న్యాయం జరగిందని పేర్కొన్నారు. పీఓకేలో ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ చేసిన దాడులను సంపూర్ణంగా సమర్థిస్తున్నామని స్పష్టం చేశారు.
ఇలాంటి సమయాల్లో దేశ ప్రజలు భారత ఆర్మీకి పూర్తి అండగా నిలవాలని, పాక్ ఆర్మీ సాధారణ పౌరులు, నివాసాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలపై చేసిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో అందరూ అప్రమత్తంగా ఉండాలని, దేశవ్యతిరేక శక్తులు సామాజిక ఐక్యతను దెబ్బతీసే కుట్రలను తిప్పికొట్టాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు.