మౌని అమావాస్య నాడు విషాదం వెంటాడింది. మౌని అమావాస్య ఘడియలు ప్రవేశించిన సమయంలోనే ఊహించని ఉపద్రవం చోటు చేసుకుంది. మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగింది.
ఉత్తర ప్రదేశ్‌లోని త్రివేణి సంగమం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచ ప్రఖ్యాత మహాకుంభమేళాలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో సుమారు 15మంది చనిపోయినట్లు ప్రచారం అవుతోంది… కానీ మృతులకు సంబంధించి అధికారికంగా ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. చాలా మంది మాత్రం గాయపడ్డారు. గాయపడ్డవాళ్లను వెంటనే సమీపంలోని ప్రత్యేక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక వైద్యులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ఆధారంగా పలువురు మృతిచెందినట్లు భావిస్తున్నారు.
గాయపడ్డవాళ్లకు కుంభమేళాలో నెలకొల్పిన ప్రత్యేక ఆసుపత్రులతో పాటు.. ప్రయాగ్‌రాజ్‌లోని పలు ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రాణనష్టం జరగకుండా, పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇవాళ జనవరి 29వ తేదీ. మౌని అమావాస్య. కుంభమేళాలో మౌని అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కుంభమేళా మొత్తంలో మౌని అమావాస్యను అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆరోజు త్రివేణి సంగమంలో స్నానమాచరించేందుకు నాగ సాధువులు, సాధువులు, భక్తులు ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలోనే మౌని అమావాస్యనాడు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో తెల్లవారు జామున తొక్కిసలాట జరిగినట్లు చెబుతున్నారు.
అంతేకాదు.. ఈ యేడాది మౌని అమావాస్య నాడు ”త్రివేణి యోగం’ అనే అరుదైన ఖగోళ అమరిక సంభవిస్తుందని చెబుతున్నారు. ఈ అరుదైన పరిణామం 144 సంవత్సరాల తర్వాత సంభవిస్తుందట. దీంతో, ఇవాళ్టి రోజు.. మహా కుంభమేళాలలో మరింత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను పెంచింది. దీంతో, లెక్కలేనంతమంది మహా కుంభమేళాలో పవిత్రస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చారు.