ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభను స్పీకర్‌గా గంభీరంగా నడిపించడంతో పాటు.. ప్రజాస్వామ్య పాలనలో తనదైన ముద్ర వేసిన దుద్దిళ్ల శ్రీపాద రావు జీవితం రాజకీయాల్లో రాణించే వారికి ఓ పాఠ్యాంశమన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. గాంధేయ వాదాన్ని, కాంగ్రెస్ ఆలోచనలను ముందుకు తీసుకువెళ్తూ సాధారణమైన ప్రజా జీవితాన్ని గడిపిన డిప్యూటీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడిగా నిలిచారన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాద రావు జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. శ్రీపాద రావు రాజకీయాల్లో రాణించిన నాటి పరిస్థితులను నెమరేసుకున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉద్దండులు కొలువైన శాసనసభలో శ్రీపాదరావు.. ప్రభుత్వానికి కావలసిన సమయం ఇవ్వడంతో పాటు, ప్రతిపక్ష పార్టీలకు కూడా ప్రజల సమస్యలను శాసనసభలో చెప్పడానికి తగిన సమయం ఇచ్చే వారన్నారు. ఎల్.ఎల్.బి లో గోల్డ్ మెడల్ సాధించి ఎల్ఎల్ఎం చదువుతున్న సమయంలో గ్రామానికి వెళ్లి అనేక సంస్కరణలు తీసుకురావడంతో గ్రామ ప్రజల ఒత్తిడి మేరకు సర్పంచ్‌గా ధన్వాడ నుంచి పోటీ చేసి రాజకీయ జీవితాన్ని ఆరంభించారని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. మహదేవపూర్ సమితి అధ్యక్షులుగా, మూడుసార్లు మంథని నుంచి శాసనసభ్యులుగా గెలుపొంది ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించి తనదైన ప్రత్యేక ముద్రను చాటుకున్నారన్నారు. మంథని నియోజక వర్గం నుంచి శ్రీపాద రావు మూడుసార్లు, ఆయన కుమారుడు శ్రీధర్ బాబు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం అంటే ఆషా మాషి కాదన్నారు. ప్రజలతో వారు మమేకమవడం, జీవితం మొత్తం ప్రజలకే అంకితం చేయడం వల్లనే ఎనిమిది సార్లు ఒకే కుటుంబానికి ప్రజలు పట్టం కట్టారని ప్రశంసించారు.
సామాజిక పరివర్తన లో భాగంగా భూసంస్కరణలు అమలు చేయడం వల్ల మంచి నాయకుడిగా ప్రజాదరణ పొంది ఈనాటి తరానికి ఆదర్శప్రాయుడిగా నిలిచారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించిన క్రమంలో.. తనకంటే ముందు బాధ్యతలు నిర్వహించిన స్పీకర్లు వారు శాసనసభను నడిపిన విధానం గురించి తెలుసుకొని ఆ విధంగా సభను నడపడానికి ప్రయత్నం చేశానన్నారు. శ్రీపాద రావు ఆశయాలను కొనసాగిస్తూ ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆయన కుమారుడు మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రను చాటుకుంటున్నారని కొనియాడారు.
తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ శాఖలకు మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తూ నిత్యం బిజీగా ఉన్నప్పటికీ.. కొంచెం సమయం దొరికినా అర్ధరాత్రి సమయాల్లో కూడా నియోజకవర్గానికి వెళ్లి తన తండ్రి అప్పగించిన ప్రజల సంక్షేమ బాధ్యతను కంటికి రెప్పలా చూసుకుంటున్నందునే శ్రీధర్ బాబు ఆ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు విజయం సాధించగలిగారని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. పోటీ ప్రపంచం, అనేక భావజాలాలు వ్యాప్తి, డబ్బు ప్రభావం ఉన్నప్పటికీ ఐదు సార్లు ఒకే నియోజకవర్గం నుంచి శ్రీధర్ బాబు గెలవడం అనేది ఆషామాషీ కాదన్నారు. జనంతో మమేకం కావడం వల్లనే ఇది సాధ్యమవుతుందన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి స్పీకర్ శ్రీపాద రావుతో ఉన్న అనుబంధం గురించి ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన జ్ఞాపకాలను, అనుభవాలను శ్రీపాద రావు జయంతి సభలో వివరించారు