ఈ యేడాది మండుతున్న ఎండల నుంచి ముందుగానే రిలీఫ్ దొరక బోతోంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దేశమంతటా రుతుపవనాల ప్రభావం కనిపిస్తోందని ఐఎండీ ప్రకటించింది. వీటి ప్రభావంతో పలు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే.. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ధూళి తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ కేంద్రం సూచించింది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే కోస్తాలో కూడా తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని, చెదురు మదురుగా భారీ వర్షాలు కూడా నమోదు కావొచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మరోవైపు.. కొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో కూడా పిడుగులు పడే ప్రమాదం ఉందని అంచనా వేసింది.
ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, కావలి, బోగోలు, దగదర్తి, చేజర్లలో ఎడతెరపి లేని వర్షం కురుస్తుండటంతో రోడ్లు జలమయమయ్యాయి. ఒంగోలు, కనిగిరి, దర్శి ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుండటంతో ఉద్యోగులు, కూలీలు ఇబ్బంది పడ్డారు. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లాల అధికారులు హెచ్చరించారు.