25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

Live Video

spot_img

చిల్లర కొట్టు.. కట్టలు పట్టు – సెటిల్ మెంట్ ఎమ్మెల్యే

చిల్లర కొట్టు… కట్టలు పట్టు అన్న చందంగా ఎమ్మెల్యే తీరు

మేడమ్ అండదండలతో బరితెగిస్తున్న మట్టి గ్యాంగ్

అడ్డుపడ్డ వారికి నోట్లతో ఎర… దారికి రాకుంటే బెదిరింపులు

సొంత ఊరినీ వదలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే అత్యుత్సాహం

అన్నయ్య సన్నిధి నాకు పెన్నిది అంటున్న వరుపుల

వన్ టైమ్ ఎమ్మెల్యే అంటున్న నియోజకవర్గ జనం

NDA కూటమి సానుకూలత, సానుభూతి పవనాలు తోడై ఎమ్మెల్యే పీఠాన్ని అధిరోహించారామె. మొదట్లో కాస్త నెమ్మదిగా కనిపించినా, తర్వాత్తర్వాత తానేమిటో చూపించడం మొదలెట్టారు. నెమ్మదిగా జూలు విదిల్చి నియోజకవర్గంపై పంజా విసరడం షురూ చేశారు. ఆమె ఎవరో కాదు… కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వరపుల సత్యప్రభ. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి కాకుండానే, అవినీతికి  గేట్లు తెరిచారని చెప్పుకుంటున్నారు జనం. తన చుట్టూ ఉండే నాయకులతో కొత్త దందా బ్యాచ్ ను ఆమె తయారు చేశారని వినికిడి. నియోజకవర్గంలో తట్ట మట్టి అడుగు దూరం కదలాలన్నా ఆ బ్యాచ్ పర్మిషన్ ఉండాల్సిందేనని టాక్.నియోజకవర్గంలోని వ్యవసాయ చెరువులను ఆదాయ వనరుగా మార్చుకుని దందా మొదలెట్టారట. బ్యాచ్ లోని నాయకులను మండలానికి  ఒకరి చొప్పున నియమించి, ఆయా మండలాల్లోని చెరువు మట్టి అమ్మకాల దందాకు తెరతీశారట. మెట్ట ప్రాంతమైన ప్రత్తిపాడు నియోజకవర్గంలో వేసవి సమయంలో ఉపాధిహామీ పథకం ద్వారా చెరువు పూడికతీత పనులు నిర్వహించేవారు. ఆ విధంగా చెయ్యడం వల్ల వ్యవసాయ పనులు లేని మూడు నెలల కాలంలో వ్యవసాయ కూలీలకు పనులు లభించేవి. వ్యవసాయ ఆయకట్టు చెరువులు లోతు అయ్యేవి.

 తవ్వకాలకు ముందు చెరువులో విహరిస్తున్న బాతులు

అయితే మేడమ్ చుట్టూ ఉండే మినీ క్యాబినెట్ లో ఒక తీర్మానం చేసుకుని చెరువులను ఆదాయ వనరుగా మార్చుకోవాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారనే టాక్ వినిపిస్తోంది. చెరువుల అభివృద్ధి పేరుతో తమకు అనుకూలంగా ఉన్న పంచాయతీల్లో తీర్మానాలు చేయించి నీటిపారుదల శాఖకు పంపించేశారట మట్టినాయకులు. ఆ పనిని ఎమ్మెల్యే సొంతూరైన ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి నుంచే ప్రారంభించారని తెలిసింది. పెదశంకర్లపూడిలోని 90 ఎకరాల్లోని వెంకన్నదొర చెరువులో ప్రతి ఏడాది వేసవిలో అనేక రకాల విదేశీ పక్షులతోపాటు, బాతులు, నీటి పిల్లులు ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటాయి. వీటన్నిటినీ పక్కన పెట్టి ఇరిగేషన్ అధికారుల అనుమతి రాకుండానే భారీ యంత్రాలను చెరువులోకి దింపి పనులు ప్రారంభించారు. ఊరిలో ఉన్న కొంతమంది యువకుల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో అనుమానమొచ్చి భారీ యంత్రాలను వెనక్కి తీసుకెళ్లిపోయారు.

తవ్వకాల అనంతరం విదేశీ పక్షుల గూళ్లు దెబ్బ తిన్న ప్రాంతం

గ్రామంలోని కొందరు యువకులు ఇరిగేషన్ అధికారులకు, కలెక్టర్ కు, డిప్యూటీ సీఎంకు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చెయ్యడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఎమ్మార్వో, ఇరిగేషన్ అధికారులు గ్రామానికి వచ్చి చెరువును పరిశీలించి రిపోర్టు రాసుకుని వెళ్లారు. పరిశీలనకు వచ్చిన అధికారుల వద్ద ఊరిలో ఉన్న మట్టినాయకులు కాస్త వినయం ప్రదర్శించడానికి ప్రయత్నించినా వాళ్లు పట్టించుకోలేదట. ఈ చెరువు విషయంలో గ్రామంలోని యువకులు ఎమ్మెల్యేని వేడుకున్నా… ఆమె మాత్రం మట్టి అమ్మకం విషయంలో తగ్గేదేలే అంటున్నారని ఆమె అనునాయులే చెప్పుకొంటున్నారు. ఇదే కాకుండా నియోజకవర్గంలోని శంఖవరం, ఏలేశ్వరం మండలాల్లో కూడా ఎమ్మెల్యే మట్టి దందా కొనసాగుతోందని, ఎవరూ అడ్డు చెప్పే ధైర్యం కూడా చెయ్యలేకపోతున్నారని వినిపిస్తోంది.

తవ్వకాల అనంతరం విదేశీ పక్షుల గూళ్లు దెబ్బ తిన్న ప్రాంతం

ఏలేశ్వరం మండలంలోని ఎర్రవరం జాతీయ రహదారి పక్కన ఉన్న పల్లపు భూమిని ఎత్తు చెయ్యడానికి దగ్గరలో ఉన్న పోలవరం కాలువ గట్టు మట్టిని కూడా తవ్వేసినట్టు సమాచారం. ఈ అనధికారిక కాంట్రాక్టులో ఎమ్మెల్యే చేతికి గట్టిగా అందినట్టు చెప్పుకొంటున్నారు. ఇలాంటి అనధికారిక అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ మట్టినాయకులు చూసుకున్నా, భేరం మాత్రం రాజమండ్రిలో ఉన్న ఎమ్మెల్యే సోదరుడితోనే చేసుకోవాలట. అన్నయ్య నుంచి ఓకే అని మెస్సేజ్ వస్తేనే మేడమ్ పచ్చజెండా ఊపుతారని ఆమె చుట్టూ తిరిగే నాయకులే గుసగుసలాడుకుంటున్నారు.

సొంత ఊరి జనం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చెరువు మట్టి అమ్మకం విషయంలో ఎమ్మెల్యే వెనక్కి తగ్గకపోవడంతో… ఈమె వన్ టైం సెటిల్ మెంట్ చేసుకుంటున్న వన్ టైమ్ ఎమ్మెల్యే అని నియోజకవర్గ జనం గుసగుసలాడుకుంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com