తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి 2025 ఇంటర్ ఫలితాల విడుదలకు సిద్ధమవుతోంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఈనెల చివరి వారంలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం దాదాపు 9.96 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వారు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ అయిన tsbie.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాల విడుదల అనంతరం ఇతర థర్డ్ పార్టీ వెబ్‌సైట్లు కూడా వాటిని అందుబాటులోకి తీసుకొస్తాయి. గత యేడాది ఏప్రిల్ 24వ తేదీన రిజల్ట్స్ విడుదలయ్యాయి. అంతకుముందు సంవత్సరం అంటే.. 2023లో మే 9న ఫలితాలు వెలువడ్డాయి. ఇక, అంతకుముందు.. ప్రతియేటా జూన్‌లో ఇంటర్ ఫలితాలు విడుదల చేసేవారు.
ఫలితాలను తెలుసుకునేందుకు :
అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ఓపెన్ చేయాలి.
హోమ్‌పేజీలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, బ్రిడ్జ్ కోర్స్ అనే లింకులు కనిపిస్తాయి.
అక్కడ “Results” లింక్‌పై క్లిక్ చేయాలి.
తరువాత మీ పరీక్ష సంవత్సరం, క్లాస్ (ఫస్ట్/సెకండ్ ఇయర్), కేటగిరీ, పరీక్ష రకం సెలెక్ట్ చేయాలి.
హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి “Get Memo” క్లిక్ చేస్తే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
వాటిని PDF రూపంలో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు.
ఇక, ఇంటర్మీడియట్ పరీక్షల్లో పాస్ కావాలంటే ప్రతి సబ్జెక్టులో కనీసం 35 శాతం మార్కులు పొందాలి. మొత్తం మీద కూడా 35% మార్కులు ఉంటే ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. ఫలితాలపై సంతృప్తి లేని విద్యార్థులు రీ వాల్యూషన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఫెయిల్ అయినవారికి సప్లిమెంటరీ పరీక్షల అవకాశమూ ఉంటుంది. ఫలితాలపై ఏవైనా సందేహాలు, అభ్యంతరాలుంటే విద్యార్థులు ఇంటర్ బోర్డును సంప్రదించవచ్చు. ఈ యేడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 5 నుంచి 24 వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 6 నుంచి 25 వరకు నిర్వహించారు.