- ఈ దశాబ్దంలోనే అతిపెద్ద హిమ విలయం..
- తీవ్రమైన హిమపాతానికి 6 కోట్ల మంది విల విల
- 2,000 విమానాలు రద్దు…25,000 విమానాల రాకపోకలు ఆలస్యం
- అందరూ ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని హెచ్చరికలు
- మంచుతుఫానుకు కూలుతున్న చెట్లు.. కరెంటు సరఫరాలో తీవ్ర అంతరాయం
- వృద్ధులు, అనారోగ్య పీడితులు, చంటి పిల్లల అగచాట్లు
అమెరికాను మంచు తుఫాను కలవరపెడుతోంది. మందమైన పొరలా, దట్టమైన అట్టలా కమ్మేస్తున్న హిమపాతానికి అక్కడి జన జీవనం అస్తవ్యస్తమవుతోంది. దాదాపు 6 కోట్ల మంది ఈ హిమ పాతం బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు.ఈ దశాబ్దంలోనే ఇంత దారుణమైన మంచు తుఫానును చూడలేదని అమెరికా వాతావరణ శాఖ అలెర్ట్ ప్రకటించింది. మంచు కురియడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దాదపు 2,200 విమానాలు రద్దు కాగా 25 వేలకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. సెంట్రల్ అమెరికాలోని పలు రాష్ట్రాలు ఈ మంచు విలయం గుప్పిట చిక్కాయి. కాన్సాస్ సిటీ నుంచి వాషింగ్టన్ వరకూ అన్ని రాష్ట్రాల్లోనూ బలమైన తూర్పు హిమపాతం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. కాన్సాస్ నుంచి న్యూజెర్సీ వరకూ అనేక రాష్ట్రాల్లో ఈ మంచు తుఫాను విలయం సృష్టిస్తోంది. బలమైన తూర్పు దిశ హిమపాతం కారణంగా అమెరికా దక్షిణ రాష్ట్రాలకు టోర్నడోలు, చలిగాలుల ప్రభావం తాకవచ్చని అమెరికా వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ఈ మంచుతుపాను వల్ల 6 కోట్లమంది అగచాట్లు పడుతున్నారని సీఎన్ ఎన్ తెలిపింది. కన్సాస్, ముస్సోరి తదితర ప్రాంతాలు మంచు గాలులకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ప్రధాన హై వేలపై మంచు గుట్టల కారణంగా వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. అందువల్ల ప్రజలంతా బయట తిరగకుండా, ఇంటి పట్టున ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దట్టమైన మంచు గాలులకు పలు చోట్ల చెట్లు విరిగి పడి మంచులో కూరుకు పోయాయి. అందువల్ల కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మంచు విడువకుండా కురుస్తుండటంతో కన్సాస్ లో రోడ్లన్నీ స్కేటింగ్ రోడ్లను, సిమెంటు రోడ్లను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 30 సెంటీమీటర్ల మేర మంచు పేరుకుపోయింది. వాషింగ్టన్ లో అనేక ప్రాంతాల్లో 10 అంగుళాల మేరకు మంచు పేరుకుపోయింది. దాంతో కొన్ని దార్లను మూసి వేశారు.
చట్ట సభలకు తప్పని మంచు కష్టాలు
దారుణ హిమపాతం చట్ట సభల కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తోంది.అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపును అధికారికంగా ప్రకటించి సర్టిఫికెట్ జారీ చేయాల్సిన చట్ట సభల అధికార్లు హిల్ కేపిటల్ లో ఇవాళ సమావేశం కావాల్సి ఉంది.ఇవాళ ఈకార్యక్రమం జరిపి సర్టిఫికేషన్ చేయడం తప్పనిసరి. దీనికోసం సభ్యులంతా హాజరు కావాల్సి ఉంది. మంచు విలయం తీవ్రంగా ఉండటంతో ఇటు దక్షిణాదినా దైనందిన కార్యకలాపాలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో మైనస్ 18 డిగ్రీలకు పడిపోవడంతో వృద్దులు, అనారోగ్య పీడితులు, చంటి పిల్లలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మిసిసిపీ వ్యాలీలో అక్కడక్కడా పిడుగులు భయపెడుతున్నాయి. కెంటకీ, మిసిసిపీ, వర్జీనియా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించారు. మూడు రాష్ట్రాల గవర్నర్లు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సూచనలు చేస్తున్నారు