-
ఈనెల 12న చిన్న హనుమాన్ జయంతి
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ ప్రారంభమైన ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు జరుగుతాయి. ప్రతి యేటా తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచే కాకుండా.. మహా రాష్ట్ర నుండి కూడా భక్తులు, దీక్షా పరులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. 41, 21, 11 రోజుల దీక్షను హనుమాన్ జయంతి రోజున విరమిస్తారు. కోరికల ఇరుముడితో వెళ్లి స్నానమాచరించి దర్శనం చేసుకుని ఇరుముడిని కడుతారు. ఈ సారి చిన్న హనుమాన్ జయంతికి దాదాపు 3 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు.
చిన్న హనుమాన్ జయంతికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున రానునుండడంతో భక్తుల సౌకర్యార్తం బారికేడ్ల నిర్మాణం, కోనేరు పరిశుభ్రత, త్రాగు నీటి వసతులపై దృష్టి సారించారు. ట్రాఫిక్ కంట్రోల్ గురించి ప్రత్యేక సిబ్బందిని నియమించారు. భక్తుల అవసరం మేరకు లడ్డు, పులిహోర ప్రసాదాలు అదనంగా తయారు చేయిస్తున్నారు. ఈ ఉత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సుదూర ప్రాంతాల నుండి దీక్షా పరులు కాలి నడకన వచ్చి అంజన్నకు మొక్కులు తీర్చుకుంటారు.