-
వేగంగా కొనసాగుతున్న కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్ లోపల ఉన్న స్టీల్ తొలగింపు పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి.
ఎస్ఎల్‌బిసి టన్నెల్ ఆఫీస్ వద్ద సొరంగం ప్రమాద ప్రదేశంలో సహాయక చర్యలు చేపడుతున్న సహాయక బృందాల ఉన్నతాధికారులతో.. ఈ ప్రమాదంపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి సమీక్ష నిర్వహించారు. సొరంగం లోపల జరుగుతున్న సహాయక చర్యలపై, సహాయక బృందాలు చేపడుతున్న పనులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్ఎల్‌బిసి ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి మాట్లాడుతూ.. ఎస్ఎల్‌బిసి టన్నెల్ లోపల కొనసాగుతున్న సహాయక చర్యలకు ఆటంకంగా ఉన్న స్టీలు, ఇనుము ఇతర పదార్థాలను నిర్విరామంగా టన్నెల్ బయటకు తరలిస్తున్నట్లు వివరించారు. టీబీఎం చివరిభాగాలను కత్తిరించి మట్టి తవ్వకాలు చేపట్టినట్లు, సహాయక పనులకు అడ్డంకిగా ఉన్న టీబీఎం భాగాలను బయటకు తరలిస్తున్నట్లు, ఊట నీటిని బయటకు తరలించే ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు వివరించారు. కేంద్ర, రాష్ట్ర సహాయక బృందాల సమన్వయంతో సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్లు, కన్వేయర్ బెల్టు పునరుద్ధరణ పనులు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో నాగర్ కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ దేవ సహాయం, ఆర్మీ అధికారులు వికాస్ సింగ్, విజయ్ కుమార్, సింగరేణి అధికారి మాధవరావు, ఎన్‌డీఆర్ఎఫ్ అధికారులు మన్మోహన్ యాదవ్, సత్యనారాయణ, ఎస్‌డీఆర్ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, హైడ్రా అధికారి జయ ప్రకాష్, దక్షిణ మధ్య రైల్వే అధికారి నేత చంద్ర, రవీంద్రనాథ్, ర్యాట్ హోల్ మైనర్స్ ప్రతినిధి ఫిరోజ్ ఖురేషి, కేరళ కడవర్ డాగ్స్ ప్రతినిధి ప్రభాత్, జేపీ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.