నైని బొగ్గు గనుల ద్వారా ఈ సంవత్సరం మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తామని డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఒరిస్సా రాష్ట్రంలోని కోణార్క్ లో జరుగుతున్న మూడవ జాతీయ మైనింగ్ మంత్రుల సదస్సు సందర్భంగా ఒరిస్సా రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మాంజీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ సందర్భంగా ఓ లేఖను ఆయనకు అందజేశారు. ఒడిశా రాష్ట్రంలోని అంగూల్ జిల్లాలో నైని బొగ్గు గనిని స్థాపించేందుకు ఒడిస్సా సీఎం కార్యాలయం నుంచి అద్భుతమైన మద్దతు అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ లేఖలో పేర్కొన్నారు. గత సంవత్సరం జూలై 24వ తేదీన ఒడిశా సీఎంతో జరిగిన సమావేశాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని ఆయనకు గుర్తు చేశారు భట్టి విక్రమార్క. ఆ చర్చలు ఫలవంతం అయ్యాయని తెలిపారు.
నైని క్యాప్టివ్ బ్లాక్ అయినందున బొగ్గు గని నుంచి ఉత్పత్తి చేసిన బొగ్గును తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా జైపూర్ లోని 800 మెగావాట్ల సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కు సరఫరా చేయాలని, జైపూర్ విద్యుత్ ప్లాంట్ నైనీ గని నుంచి దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉందని, లాజిస్టిక్స్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయని ఉపముఖ్యమంత్రి తన లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఒడిశాలోని నైనీ బొగ్గు గని సమీపంలో సింగరేణి సంస్థ పిట్ హెడ్ ఓవర్ ప్లాంట్‌గా 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని భావిస్తోందన్నారు. దీని ద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గడంతో పాటు, ఉత్పత్తి అయిన బొగ్గు లాభదాయకంగా ఉపయోగించే అవకాశం ఉంటుందని భావిస్తున్నామని ఒరిస్సా సీఎంకు అందించిన లేఖలో భట్టి విక్రమార్క తెలిపారు.
20వ EPS – ఎలక్ట్రికల్ పవర్ సర్వే నివేదిక ప్రకారం రాబోయే మూడు దశాబ్దాల పాటు థర్మల్ విద్యుత్‌కు భారీ డిమాండ్ ఉంటుందన్నారు. గత యేడాది మే ఒకటో తేదీన మినిస్ట్రీ ఆఫ్ కోల్ కార్యదర్శి రాసిన లేఖ ద్వారా గనులకు దగ్గరగా కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్లను స్థాపించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. రవాణా ఖర్చును తగ్గించడం, నాణ్యమైన విద్యుత్ సరఫరా, పర్యావరణాన్ని పరిరక్షించడం వంటి అంశాల నేపథ్యంలో గని నుంచి విద్యుత్తు ఉత్పత్తి లాభదాయకంగా ఉంటుందని ఒడిశా సీఎంకు రాసిన లేఖలో భట్టి విక్రమార్క పేర్కొన్నారు. సింగరేణి అధికారుల బృందం, ఒడిశా అధికారుల బృందంతో జరిగిన చర్చల్లో భాగంగా జరపాడ, తుకుడ, అలాగే, హండప్ప, బని, నాలిని సైట్లు రెండు రాష్ట్రాలకు చాలా ప్రయోజనకరమైనవన్నారు. ఇవి ఉపాధి అవకాశాలను సృష్టించడంతోపాటు సానుకూల మౌలిక సదుపాయాల అభివృద్ధిని అందిస్తాయని తన లేఖలో పేర్కొన్నారు.
భట్టి లేఖపై వెంటనే స్పందించిన ఒడిశా సీఎం :
పై విషయాలను దృష్టిలో పెట్టుకొని నైని బొగ్గు గని సమీపంలో సింగరేణి ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును స్థాపించడానికి తగిన భూమిని కేటాయించేందుకు, ఏర్పాట్లచేసేందుకుకు సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతున్నట్టు డిప్యూటీ సీఎం తన లేఖలో పేర్కొన్నారు. ఈ విజ్ఞాపనకు ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంజీ వెంటనే సానుకూలంగా స్పందించారు. నైనీ బ్లాక్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి అన్ని రకాల సహకారం అందిస్తామని, అవసరమైన భూమిని కేటాయించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేస్తానని కూడా ఒడిశా సీఎం హామీ ఇచ్చారు. ఒడిశా సీఎం మాంజీకి ఈ లేఖ సమర్పించిన సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు.. తెలంగాణకు చెందిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా ఉన్నారు.