మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ప్రతి యేడూ మాదిరిగానే ఒంటి పూట బడులు ఎప్పుడెప్పుడా అని స్టూడెంట్స్ కంటే ఎక్కువ తల్లిదండ్రులే ఎదురు చూస్తున్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. ఒంటిపూట బడులు ఎప్పటినుంచో క్లారిటీ ఇచ్చేసింది. ఈనెల 15వ తేదీ శనివారం నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు మొదలవుతున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయి.
తెలంగాణ లోని అన్ని పాఠశాలలూ దీనిని ఫాలో కావాలి. ఈమేరకు రాష్ట్ర విద్యా శాఖ ఇవాళ సర్క్యులర్ విడుదల చేసింది. ఒంటి పూట బడులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని, 12.30కు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం పెడతారని విద్యా శాఖ స్పష్టం చేసింది. పదవ తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో టెన్త్ విద్యార్థులకు మాత్రం ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని ఆ సర్క్యులర్‌లో తెలిపింది.
పదో తరగతి పరీక్షలు జరుగుతున్న కేంద్రాల్లో మాత్రం స్కూళ్లు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని విద్యా శాఖ వెల్లడించింది. సర్కారు, ఎయిడెడ్ స్కూళ్లలో మధ్యాహ్నం12.30 గంటలకు పిల్లలకు మిడ్డే మీల్స్ పెట్టి, ఇంటికి పంపించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ, ఈ యేడాది ఇప్పుడే ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు చేరుకున్నాయి. ఈ ఎండల నేపథ్యంలో విద్యార్థులకు వీలైనంత త్వరగా ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.