ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ఓ రేంజ్‌లో హాట్ కామెంట్స్ చేశారు. అమరావతి రాజధాని కోసం 34 వేల ఎకరాలు తీసుకున్నారని, ముందే 58 వేల ఎకరాల స్థలం ఉన్నప్పటికీ ఆ స్థాయిలో భూ సేకరణ అవసరమా? అని ప్రశ్నించారు. పైగా.. అసలు రాజధానికి అవసరం ఉన్న భూమి కేవలం 2700 ఎకరాలు మాత్రమే అన్నారు.
ఇప్పటికే తాత్కాలికం పేరుతో భవనాలు కట్టి, ఇప్పుడు మరో 44 వేల ఎకరాలు ఎందుకంటూ ప్రశ్నించారు. రాజధానికీ, ప్రాజెక్టులకీ పేరు పెట్టి ప్రజల భూములు తీసుకోవడం సరికాదన్నారు. రాజధాని కోసం ఇప్పటికే 31 వేల కోట్లు అప్పుచేసి, ఇంకా 69 వేల కోట్లు అప్పులు తీసుకు రావడం అవసరమంటారా? అని ప్రశ్నించారు.
ప్రజలకు ఎత్తైన భవనాలు కాదని, మంచి పరిపాలన అందిస్తే చాలన్నారు వడ్డే శోభనాద్రీశ్వర్‌రావు. హైపర్ లూప్ రైలు.. అమెరికా, జపాన్, జర్మనీలో కూడా లేవని, మన రాష్ట్రంలో మాత్రం దీని డీపీఆర్ తయారు చేస్తామంటారా? అని ప్రశ్నించారు. కేంద్రం న్యాయం చేయకపోయినా.. ప్రత్యేక హోదా మాట తప్పినా, చంద్రబాబు మాత్రం పోరాటం చేయలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మన రాష్ట్రానికి అవసరమైనది పంటలకు సాగునీరు అని, కిడ్నీ వ్యాధితో పోరాడుతున్న ఉద్ధానం ప్రజల ఆరోగ్యం కావాలని, కానీ చర్చ మాత్రం ఎయిర్ పోర్టుల గురించే జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. పేదలకు విద్యలో అవకాశం ఇవ్వాలనుకుంటే.. టీడీపీ నాయకుల విద్యాసంస్థల్లో పది శాతం సీట్లు ఇవ్వాలని సవాల్ విసిరారు. చంద్రబాబు నిజంగానే పేదల గురించి ఆలోచిస్తే, ఆయనకు చెందిన హెరిటేజ్ సంస్థ నుంచి విద్యార్థులకు పాలు, పెరుగు, మజ్జిగ ఉచితంగా ఇవ్వాలని సలహా ఇచ్చారు. ఇలాంటివి చేసి చూపిస్తే.. చంద్రబాబునే మిగతా వాళ్లంతా ఆదర్శంగా తీసుకుంటారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర్‌రావు వ్యాఖ్యానించారు.