భారత్ సరిహద్దు ప్రాంతాల్లో చైనా తయారీ ఎస్ హెచ్-15 శతఘ్నులను పాకిస్థాన్ మోహరించడం కలకలం రేపుతోంది. ఇటీవల కశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన దాడి, ఆపై సరిహద్దుల్లో చోటుచేసుకున్న కాల్పుల నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ, పాకిస్థాన్ కీలక సైనిక చర్యలకు పాల్పడుతోంది. చైనా నుంచి పొందిన శక్తివంతమైన ఎస్ హెచ్-15 సెల్ఫ్-ప్రొపెల్డ్ ఆర్టిలరీ వ్యవస్థలను భారత సరిహద్దు సమీప ప్రాంతాలకు తరలించింది.
పాక్ బలగాలు భారీ చైనా ఆయుధాలను తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కశ్మీర్ ఘటన అనంతరం రెండు రాత్రుల పాటు సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాల మధ్య తీవ్రమైన కాల్పులు చోటుచేసుకోవడం, ఆ వెంటనే ఆయుధాల మోహరింపు జరగడం, పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చుతున్నాయి. ఈ పరిణామం సరిహద్దుల్లో పెరిగిన గందరగోళానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది.
తాజా నివేదికల ప్రకారం, చైనా తయారీ ఆయుధాలను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో పాకిస్థాన్ ముందుండటం గమనార్హం. ఇస్లామాబాద్‌కు బీజింగ్ పెద్ద ఎత్తున సైనిక సహకారం అందిస్తోందని, ఎస్ హెచ్-15 ఫిరంగుల మోహరింపు ద్వారా మరోసారి స్పష్టమైంది. ఇరు దేశాల మధ్య సైనిక సంబంధాలు మరింత బలపడుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
చైనా తయారీ ఎస్ హెచ్-15 ఫిరంగులు అత్యాధునిక సాంకేతికతతో, వేగంగా కదిలే సామర్థ్యంతో రూపొందించబడ్డాయని రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో పాక్ తన సరిహద్దుల వద్ద వీటిని మోహరించడాన్ని భారత్ సీరియస్‌గా తీసుకుంది. భారత భద్రతా దళాలు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికార వర్గాలు తెలిపాయి.