29.9 C
Hyderabad
Wednesday, August 26, 2026

Live Video

spot_img

శరద్‌పవార్‌ శకం ముగిసినట్లేనా?

శరద్‌పవార్‌ శకం ముగిసినట్లేనా? స్వయంగా ఆయనే ప్రకటించినట్లు ఇక రాజకీయాల నుంచి ఆయన నిష్క్రమిస్తున్నారా? లోక్‌సభ సభ్యత్వ పదవీకాలం ముగియగానే శరద్‌ పవార్‌ సుదీర్ఘ రాజకీయ జీవితానికి గుడ్‌బై చెప్పనున్నారా? ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వెల్లడైన ఫలితాలు ఏం సూచిస్తున్నాయి? తన రాజకీయ జీవితంలో, ఇంతటి ఘోర పరాజయం ఎన్నడూ చవిచూడని నాయకుడిగా శరద్‌ పవార్‌ కలత చెందారా? ఎన్నికలకు ముందే ప్రకటించినట్లు కీలక నిర్ణయం తీసుకునేందుకే మొగ్గు చూపుతారా? భాస్కర న్యూస్‌ స్పెషల్ స్టోరీలో చూద్దాం…

శరద్‌పవార్‌. మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. దేశ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. చిన్నవయసులోనే సొంతంగా పార్టీ పెట్టి పిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన రికార్డు ఆయన సొంతం. అయితే, తాజా ఎన్నికల్లో ఓ రకంగా ఆయన మట్టి కరిచారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇంతటి పరాభవం ఎదుర్కోవడం వెనుక అనేక పరిణామాలున్నాయి. అయితే, ఎన్నికలకు ముందే ఆయన ప్రకటించినట్లు సుదీర్ఘ రాజకీయ అనుభవం నుంచి నిష్క్రించే సమయంలో ఇంతటి ఘోర పరాభవం ఎదుర్కోవడం మాత్రం చర్చనీయాంశమయ్యింది.

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహావికాస్ అఘాఢి చతికిలపడింది. మహాయుతి బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఒకరకంగా క్లీన్‌ స్వీప్‌ చేసినట్లే. మహావికాస్ అఘాడి కూటమి తరపున కాంగ్రెస్ 101 స్థానాల్లో, శివసేన (యుబిటి) 95 స్థానాల్లో, ఎన్‌సిపి (ఎస్‌పి) 86 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. ఇక, అధికార మహాకూటమిలో బీజేపీ అత్యధికంగా 149 స్థానాల్లో, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81 స్థానాల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ 59 స్థానాల్లో పోటీ చేశాయి.ఈ రెండు ప్రధాన కూటముల్లో మహాయుతి తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది.

మహా అఘాఢీ కూటమిలో భాగమైన శరద్‌పవార్, దేశ రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞుడైన నాయకుడు. ఐదు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ జీవితం ఆయన సొంతం. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు. మహారాష్ట్ర నుంచి జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పిన జాతీయ నాయకుడిగా ముద్ర ఉంది. శరద్‌పవార్‌ మొట్టమొదటి సారిగా 1967లో 27 సంవత్సరాల వయస్సులో బారామతి నియోజకవర్గం నుంచి మహారాష్ట్ర శాసనసభలో అడుగుపెట్టారు. అంచెలంచెలుగా ఎదిగారు. నాలుగు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. కేంద్రమంత్రిగా పలుసార్లు బాధ్యతలు నిర్వర్తించారు. కీలకమైన శాఖలకు కేంద్ర మంత్రిగా పనిచేశారు. మొత్తంగా చూస్తే.. పార్లమెంటరీ రాజకీయాల్లో 30 యేళ్లుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా అనేక సార్లు పనిచేశారు. 1980లో తొలిసారి కేంద్రమంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత కూడా పలుమార్లు రక్షణ, వ్యవసాయ వంటి కీలక శాఖలకు కేంద్ర మంత్రిగా పనిచేశారు.

మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్‌పవార్‌ చెరగని ముద్ర వేశారు. తన 84యేళ్ల వయసులో తాను స్థాపించిన పార్టీని మేనల్లుడే చీల్చాడు. అయితే, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తనదైన మార్క్‌ చూపించారు. శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీ ప్రాభవం కోల్పోలేదు. మహారాష్ట్రను క్లీన్‌స్వీప్‌ చేసింది. అయితే, ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సీన్‌ రివర్స్‌ అయ్యింది. మొత్తం 86 స్థానాల్లో పోటీచేస్తే 13 స్థానాల్లో మాత్రమే ఎన్‌సీపీ (శరద్‌పవార్‌) పార్టీ నేతలు విజయం సాధించారు.

శరద్‌పవార్‌ రాజకీయాల్లోకి వచ్చిన నాటి పరిస్థితులు, ముఖ్యమంత్రిగా ఎదగడానికి దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే.. 1977లో ఎమర్జెన్సీ సమయంలో శరద్‌పవార్‌.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చారు. తన గురువు యశ్వంతరావు చవాన్‌తో కలిసి కర్ణాటకలోని డి. దేవరాజ్ ఉర్స్‌కు చెందిన కాంగ్రెస్ (యు)లో చేరారు. ఎన్నికల తర్వాత జనతా పార్టీని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌లు రెండూ కూటమిగా ఏర్పడ్డాయి. కొద్దిరోజులు కలిసి వెళ్లిన తర్వాత హఠాత్తుగా యూకే కాంగ్రెస్‌కు చెందిన దేవరాజ్ జనతా పార్టీలో చేరారు. ఇక్కడ శరద్ పవార్ గురువైన యశ్వంత్ రావ్ చవాన్ తిరిగి కాంగ్రెస్ (ఐ)లో చేరారు. కానీ, శరద్ పవార్ మాత్రం ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చూసి గురువు కోసం వెనుదిరిగి చూడలేదు. జనతా పార్టీ మద్దతుతో 38 ఏళ్లలో మహారాష్ట్రకు అత్యంత చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు.

ఇప్పుడు అజిత్ పవార్ కూడా తన మామ శరద్ పవార్ అడుగుజాడల్లోనే నడిచారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జూన్ 2022లో శివసేనలో తిరుగుబాటు జరిగింది. ఒక సంవత్సరం తర్వాత, జూలై 2023లో, ఎన్‌సీపీలో తిరుగుబాటు వచ్చింది. అజిత్ పవార్, శరద్ పవార్ మధ్య విభేదాల తర్వాత ఎన్సీపీలో చీలిక వచ్చింది. అజిత్ పవార్ మహాకూటమితో కలిసి వెళ్లారు. ఆ తర్వాత ఎన్‌సీపీలో శివసేన లాంటి అసలు జాతీయవాది ఎవరనే యుద్ధం మొదలైంది. ఆ పోరులో ఎన్నికల సంఘం అజిత్ పవార్ వైపే మొగ్గు చూపింది. ఎన్‌సీపీ గుర్తు గడియారాన్ని అజిత్‌పవార్‌కు కేటాయించింవది. కానీ, ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితం మాత్రం శరద్‌పవార్‌కు అనుకూలంగా వచ్చింది. కానీ, ఇప్పుడు అసెంబ్లీ ఫలితం శరద్‌పవార్‌కు షాకిచ్చింది. అజిత్ పవార్‌కు అనుకూలంగా వచ్చింది.

అయితే, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు శరద్ పవార్ కీలక ప్రకటన చేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని, తాను పార్లమెంటరీ రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. బారామతిలో ఒక సభలో ప్రసంగించిన పవార్, రాజ్యసభలో తన ప్రస్తుత పదవీకాలం దాదాపు 18 నెలలు మిగిలి ఉందని, అతను తిరిగి ఎన్నికల్లో పోటీ చేయొద్దనుకుంటున్నట్లు ప్రకటించారు. జాతీయ రాజకీయాల నుండి శరద్ పవార్ నిష్క్రమిస్తున్నట్లు చేసిన ఆ ప్రకటన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఐదు దశాబ్దాలకు పైగా మహారాష్ట్ర తోపాటు భారత రాజకీయాల్లో కేంద్ర వ్యక్తిగా ఉన్న శరద్ పవార్ రాజకీయాల నుండి నిష్క్రమిస్తానన్న ప్రకటన రాష్ట్ర రాజకీయ దృశ్యాన్ని మార్చేసింది. ఆయన నిష్క్రమణ.. కొత్త అధ్యాయానికి తెరతీస్తుందని, మహారాష్ట్ర రాజకీయ రంగంలో వర్ధమాన నేతలకు పగ్గాలు చేపట్టే అవకాశం ఏర్పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com