38.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

విజయసాయిరెడ్డి రాజ్యసభ సీటు… విశ్లేషణ

ఒక పార్టీ నుంచి మరో పార్టీకి కప్పదాట్లు ఒకప్పుడు సంచలనం. ఇపుడు పార్టీ ఫిరాయింపులు సాధారణమయ్యాయి. ఆధునిక రాజకీయాల్లో ఒకడుగు ముందుకేసిన నేతలు ప్రస్తుత పార్టీకి, పదవికి రాజీనామా చేసి తాము కోరుకున్న చోటకు(పార్టీలోకి) అధికారికంగా జంప్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది అదే అని విశ్లేషణ జరుగుతోంది. ఒక రాజ్యసభ స్థానానికి ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు కేంద్రబిందువుగా మారింది.
అందరు అనుకున్నట్టుగా జరిగితే వైఎస్ఆర్ సిపి మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇన్నాళ్లూ ఆడిన దోబుచులాటకు తెరపడే రోజు దగ్గరలోనే ఉంది. విజయ సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని భర్తీ చేసేందుకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 22వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 29 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. వచ్చే నెల 9వ తేదీన ఎన్నిక నిర్వహిస్తారు.
ఉరుములు లేని వర్షంలా తనకు రాజకీయాలు ఇక చాలని శేష జీవితం వ్యవసాయ క్షేత్రంలో గడుపుతానని వేదాంతం మాట్లాడిన విజయసాయిరెడ్డి అసలు రంగు త్వరలో బయటపడనుంది. విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ స్థానం విషయంలో రాష్ట్ర ప్రజలకు స్పష్టత రానుంది. వైసీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత తాను వ్యవసాయం చేసుకుంటానని సాయిరెడ్డి చెప్పినా బీజేపీ నుంచి ఆయన ఖచ్చితంగా రాజ్యసభకు వెళ్తారనే చర్చే అధికంగా జరుగుతోంది. పైగా కేంద్రంలో మంత్రిపదవి కూడా ఇస్తారని పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఇటీవలే పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ యధాలాపంగా ఇదే తరహాలో కామెంట్ చేయడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఈ విషయమై ఇప్పటి వరకు బీజేపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. కమలం శ్రేణుల్లో కూడా ఈ కోణంలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో సాయిరెడ్డి రాజ్యసభకు వెళ్లడం ఖాయమనే భావనే చాలా మందిలో వ్యక్తమవుతోంది.
టీడీపీ, జనసేనలను తిట్టిన తిట్టు తిట్టకుండా విమర్శలు గుప్పించిన సాయిరెడ్డికి రాజ్యసభ టిక్కెట్ ఇస్తామని బీజేపీ చెప్పినా… దానికి టీడీపీ, జనసేన అంగీకరిస్తాయా చూడాలి. ఆ రెండు పార్టీలు సానుకూలంగా స్పందించకపోవచ్చని… అందుకే సాయిరెడ్డి విషయంలో కొంత సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు విజయసాయి రెడ్డి ఉపయోగపడతారని టిడిపి, జనసేనల్లో చర్చ జరుగుతుందట.
రాజ్యసభ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది కనుక సస్పెన్సుకు తెర పడే రోజులు దగ్గరపడినట్టే అని చెప్పవచ్చు. బీజేపీ సాయిరెడ్డికి టిక్కెట్ ఇస్తుందా..? ఇస్తే టీడీపీ-జనసేనలు ఏం చెప్పుకుంటాయి..? ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టుగా ఎన్ డి ఏ కూటమి తరపున విజయసాయిరెడ్డి రాజ్యసభ బరిలో దిగితే.. తర్వాతి పరిణామాలు మాజీముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సానుకూలంగా మారినట్టేనని రాజకీయ విశ్లేషకుల అంచనా.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com