విజయ సాయి రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో ఈయన గురించి తెలియని వాళ్లు దాదాపు ఉండరు. మొన్నటి దాకా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు. తనకు ఇంకా మూడు సంవత్సరాల పదవీ కాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి ఇటీవలే రాజీనామా చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆవిర్భావం నుంచీ అండగా ఉన్న కీలక నేత. జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో ముందు వరుసలో ఉండే నాయకుడు. ఒకానొక దశలో వైసీపీలో జగన్ తర్వాత ఆయనే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. ఆర్థిక వ్యవహారాల్లో దిట్ట అయిన విజయ సాయి రెడ్డి.. వైసీపీ కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. పార్టీ కూడా ఆయనకు అదే స్థాయిలో ప్రయారిటీ ఇచ్చింది. అయితే, ఉన్నట్టుండి కొద్ది రోజుల క్రితం ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు విజయ సాయిరెడ్డి. కనీసం ఎవరి ఊహకు అందని సంచలన నిర్ణయం అది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి.. అలాగే, రాజ్యసభ సభ్యత్వానికి కూడా విజయ సాయి రెడ్డి రాజీనామా చేశారు. ఈ హఠాత్ పరిణామానికి తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. ఆయన సడెన్ డెసిషన్ వెనుక అనేక విశ్లేషణలు కొనసాగాయి. పలు కోణాల్లో అంచనాలు షికార్లు చేశాయి. కానీ, ఆయన మాత్రం తాను రాజకీయాలకు పూర్తిగా దూరమవుతున్నానని, ఇకపై వ్యవసాయం మాత్రమే చేసుకుంటానని ప్రకటించారు. ప్రకటించడమే కాదు.. ఏకంగా తన వ్యవసాయ క్షేత్రంలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు కూడా…
ఆ తర్వాత కూడా విజయ సాయి రెడ్డి హఠాత్తుగా తీసుకున్న నిర్ణయంపై అనేక విశ్లేషణలు కొనసాగాయి. రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడెందుకు వచ్చిందన్న చర్చలు జరిగాయి. అయితే, కొంతకాలం సాగిన చర్చలు కనుమరుగయ్యాయి.. కానీ, ఇప్పుడు సడెన్‌గా విజయ సాయిరెడ్డి నేరుగా కనిపించారు. ఆ తర్వాతే ఆయన కార్యాచరణ, ఆలోచనలు, ప్రయత్నాలు క్రమంగా బయటకు వస్తున్నాయి.
ఉప రాష్ట్రపతిని ఎందుకు కలిశారు?
ఇటీవల ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ హైదరాబాద్ వచ్చారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఉప రాష్ట్రపతి.. హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కంది ఐఐటీని సందర్శించారు. ఆ కార్యక్రమంలో అకస్మాత్తుగా విజయ సాయి రెడ్డి ప్రత్యక్ష మయ్యారు. ఉప రాష్ట్రపతితో సన్నిహితంగా మెదిలారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ కూడా సిట్టింగ్ ఎంపీల కంటే విజయ సాయిరెడ్డికే ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించింది. దీంతో, మళ్లీ విజయ సాయిరెడ్డి పొలిటికల్ లైఫ్‌పై చర్చలు మొదలయ్యాయి. ఇప్పుడే కాదు.. ఇంతకు ముందే.. హస్తినలో బీజేపీ పెద్దలతో విజయ సాయిరెడ్డి ఆల్‌రెడీ టచ్‌లోకి వెళ్లారన్న విషయాలు బయటకు వచ్చాయి. విజయ సాయి రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోలేదని, ఆయన చిన్న గ్యాప్ మాత్రమే తీసుకున్నారన్న చర్చ మొదలయ్యింది.
విజయ సాయిరెడ్డి ప్లాన్ ఏంటి?
వాస్తవానికి విజయ సాయిరెడ్డి తన పదవీ కాలాన్ని కూడా త్యాగం చేసి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. గతంలో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డి కూడా రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇకపై వ్యవసాయం చేసుకుంటానని స్పష్టం చేశారు. అన్నట్లుగానే రఘువీరా రెడ్డి ఎక్కడా పొలిటికల్ వేదికలపై కనిపించడం లేదు. ఇప్పుడు విజయ సాయిరెడ్డి కూడా అదే మాదిరిగా రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారనే అందరూ భావించారు. ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్టులు, షేర్ చేసిన ఫోటోలతో ఆ క్లారిటీకి అందరూ వచ్చేశారు. కానీ, విజయ సాయి రెడ్డి పక్కా వ్యూహంతోనే నిర్ణయం తీసుకున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ పెద్దలతో అన్నీ మాట్లాడుకున్న తర్వాతే విజయ సాయిరెడ్డి రాజీనామా చేశారని జగదీప్ ధన్‌ఖడ్ ప్రోగ్రాంలో కనిపించడంతోనే ఓ క్లారిటీ వచ్చిందన్న చర్చ నడుస్తోంది. రాజ్యసభకు రాజీనామా చేసి వెంటనే పార్టీ మారితే వేరే మాదిరిగా సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశ్యంతోనే రాజకీయ సన్యాసం ప్రకటన చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన రాజ్యసభ సీటు భర్తీ కాగానే.. భారతీయ జనతా పార్టీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే రాజకీయాల నుంచి వైదొలిగానని స్వయంగా ప్రకటించిన తర్వాత కూడా విజయ సాయిరెడ్డి మళ్లీ రాజకీయ యవనికపై కనిపిస్తున్నారని అంటున్నారు. అంతేకాదు.. ఆయన రాజీనామా చేసినప్పటి నుంచీ పలు రహస్య సమావేశాలు కూడా నిర్వహించారని, పలువురితో భేటీ అయ్యారని వార్తలు వచ్చాయి. కానీ, ఆ సమాచారం బయటకు పొక్కకుండా అత్యంత జాగ్రత్త పడ్డారాయన. మరోవైపు.. భారతీయ జనతా పార్టీ ముఖ్యులతో నిరంతరం ఆయన టచ్‌లో ఉన్నట్లుగా సమాచారం.
ముహూర్తం ఫిక్స్? :
వైసీపీలో మొన్నటిదాకా కీలక పాత్ర పోషించిన విజయ సాయిరెడ్డి.. రాజ్యసభ సభ్యుడిగా ఢిల్లీ వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెట్టేవారు. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తోనూ.. బీజేపీలో కీలప పాత్ర పోషిస్తున్న అధిష్టానంలోని ముఖ్య నేతలతోనూ విజయ సాయిరెడ్డి రిలేషన్ షిప్ పెంచుకున్నారు. వైసీపీ వ్యవహారాల గురించి బీజేపీ పెద్దలతో పలుమార్లు భేటీ అయిన సందర్భాల్లోనే వాళ్లకు దగ్గరైనట్లు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే విజయ సాయిరెడ్డి బీజేపీలో చేరడానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందంటున్నారు. వచ్చే జూన్ లేదా జూలై నెలలో విజయ సాయిరెడ్డి బీజేపీలో చేరతారని, అంతేకాదు.. వైసీపీలో మాదిరిగానే బీజేపీలోనూ కీ రోల్ పోషించే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. కాషాయ పార్టీ పెద్దలు కూడా విజయ సాయి రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు సానుకూలంగా ఉన్నారని.. ఆ విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాతే విజయ సాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది.
పాపులర్ లీడర్ కాదు కానీ… :
వాస్తవానికి విజయసాయి రెడ్డి ఛరిష్మా గమనిస్తే.. ఆయన జనంలో పెద్దగా పట్టున్న పాపులర్ లీడర్ అయితే కాదు.. కానీ, అంతర్గతంగా పార్టీకి తెరవెనక వ్యవహారాలు చక్కపెట్టడంలో దిట్ట అని చెప్పొచ్చు. అయితే, ఆయన బీజేపీలో చేరతారన్న సంకేతాలపై ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సమాచారం ఉందని కూడా అంటున్నారు. అయితే, విజయ సాయిరెడ్డి బీజేపీలో చేరితే జగన్ మరింత బలహీన పడతారన్న ఆలోచనలో చంద్రబాబు అండ్ టీమ్ ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అంతేకాదు.. విజయ సాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడారు. వాళ్లపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలు, చేసిన ఆరోపణలు కేవలం రాజకీయాల్లో భాగమేనని… వ్యక్తిగతంగా వాళ్లతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని కూడా విజయ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అంటే.. విజయ సాయి రెడ్డి పదవికి రాజీనామా చేసినప్పటినుంచీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ ఓ వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి.