29.9 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

కలెక్టర్లను మార్చకపోతే కష్టమే

  • జిల్లా కలెక్టర్ల వ్యవహార సరళిపై మంత్రుల ఆగ్రహం
  • తన జిల్లా కలెక్టర్‌పై ఫిర్యాదు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
  • ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్న ఓ జిల్లా కలెక్టర్
  • కలెక్టర్ల తీరుపై క్యాబినేట్‌లో భగ్గుమన్న మంత్రులు
  • త్వరలోనే బదిలీలు చేస్తామని సీయం రేవంత్‌రెడ్డి హామీ

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పలువురు ఐఏఎస్‌ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ సందర్భం వచ్చినప్పుడల్లా అసంతృప్తి వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఐఎఎస్‌లు చెప్పిన మాట వినడం లేదని, ప్రభుత్వానికి సహకరించడం లేదని స్వయంగా ముఖ్యమంత్రే అనేక సందర్భాల్లో బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. మంత్రులు కూడా తమ జిల్లా కలెక్టర్లు మాట వినడం లేదని అనేక సార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళారు. తాజా నిన్న గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరూ మూకుమ్మడిగా కలెక్టర్ల వ్యవహార సరళిపై విరుచుకుపడ్డారు. అటు జిల్లాలో కలెక్టర్లు… ఇటు తమ శాఖల కార్యదర్శలు సైతం తమను లెక్క చెయ్యడం లేదని, తమ మాట వినడం లేదని, కొందరు కలెక్టర్లైతే వారి బంధువర్గాల ద్వారా జిల్లాలో భూ సెటిల్‌మెంట్లు కూడా చేసెస్తున్నారని ముఖ్యమంత్రి వద్ద అసహనం వ్యక్తం చేశారు.

చాలా రోజుల నుంచి ఈ విషయాలపై ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని దీనివల్ల జిల్లాల్లో తమకు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతున్నాయని మంత్రులు అంటున్నారు. మంత్రులే కాదు గతంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జిల్లా కలెక్టర్లు ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని… ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తున్న మైలేజ్ రాకపోవడానికి కలెక్టర్లే కారణమని కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలనే తక్షణం అమలు చెయ్యకుండా తాత్సారం చేస్తుంటే ఇక మంత్రుల విషయలో కలెక్టర్ల ప్రవర్తన ఏవిధంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. గడచిన 14 నెలలుగా కలెక్టర్లతో విసిగి వేశారిపోయిన మంత్రుల ఆగ్రహం గురువారం నాటి క్యాబినేట్‌ సమావేశంలో ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ అయితే ఏకంగా తన జిల్లా కలెక్టర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చాలా విషయాల్లో కలెక్టర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కలెక్టర్ల ప్రవర్తనతో మంత్రులు మేమా వాళ్ళ అన్న అనుమానం కలుగుతోందని పొన్నం ప్రభాకర్‌ ముఖ్యమంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు మంత్రులు కూడా తమ తమ జిల్లాలకు అంటే ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లపై ఫిర్యాదు చేసినట్లుగా తెలిసింది. ప్రభుత్వం మారినా కొందరు అధికారులు బిఆర్ఎస్ హయాంలో ఏ విధంగా అయితే పనిచేశారో ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేస్తున్నారని దీని వల్ల చిన్న చిన్న విషయాల్లో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని మంత్రులు ముఖ్యమంత్రి దృష్టకి తీసుకువెళ్లారు.

మరికొందరు కలెక్టర్లు ఏకంగా సెటిల్మెంట్లు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయని ఒకరిద్దరు మంత్రులు సీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. రాజధానికి సమీపంలో ఉన్న ఒక జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులు భూ సంబంధింత సెటిల్మెంట్లు చేస్తున్నారని ఓ సీనియర్‌ మంత్రి సీయంకు చెప్పారు. దాదాపు 25 కోట్ల రూపాయల విలువైన భూకి సంబంధించి ఆ జిల్లా కలెక్టర్‌ తండ్రి స్వయంగా మీటింగ్‌లో కూర్చుని సెటిల్మెంట్‌ చేసినట్లు తమ దృష్టికి వచ్చినట్లుగా ఆ సీనియర్‌ మంత్రి సీఎం రేవంత్‌రెడ్డికి తెలియజేసినట్లుగా సమాచారం. సదరు కలెక్టర్‌కు స్వయంగా మంత్రి ఫోన్ చేసి హెచ్చరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేసినప్పుడు కూడా ఆ కలెక్టర్ల తీరు వివాదాస్పదమైంది. ఆ కలెక్టర్ తండ్రి ప్రస్తుతం క్రియాశీలకంగా వ్యవహరిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను గందరగోళానికి గురి చేస్తున్నట్లుగా ఇద్దరు మంత్రులు ఫిర్యాదు చేశారు.

ఇక మంత్రుల శాఖలలో ఉన్న కార్యదర్శులు కూడా కొందరు మంత్రులు మాట వినడం లేదని ఫిర్యాదులు అందాయి. స్వయంగా సీఎం పేషీ నుంచి కార్యదర్శులకు సంబంధించి కొంత గ్యాప్ ఉందని మంత్రుల అంగీకరిస్తున్నారు. స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని చాలా రోజుల నుంచి విమర్శలు ఉన్నాయి. మొన్నటివరకు ఎన్నికల కోడ్ ఉండడం వల్ల బదిలీలు సాధ్యం కాలేదని ఇప్పుడు వెంటనే పనిచేయని కలెక్టర్లను కార్యదర్శులను బదిలీ చేయాలని కొందరు మంత్రులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. రాజకీయంగా రానున్న రెండు సంవత్సరాలు అత్యంత కీలకం కావడం చేత సరైన కలెక్టర్లు వివిధ శాఖలకు సంబంధించిన కార్యదర్శులు లేకపోతే సమస్యలు వస్తాయని దీనివల్ల ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది కనుక ముఖ్యమంత్రి వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకోవాలని మంత్రుల అభిప్రాయపడుతున్నారు. ఈవిషయంపై సరైన నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి మంత్రులకు హామీ ఇచ్చినట్లు తెలిసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com