భారత్-రష్యా మధ్య రక్షణ బంధం ఇప్పటిది కాదు.. కాలం మారుతున్న కొద్ది ఈ బంధం బలపడుతుందే తప్ప.. ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య అనేక రక్షణ ఒప్పందాలు ఉన్నాయి. ఇప్పుడు మరో కీలక ఒప్పందం కుదుర్చుకోనున్నది భారత్. ఈ ఒప్పందం విలువ సుమారు 4 బిలియన్ల డాలర్లు. ఈ ఒప్పందం కీలక దశకు చేరుకుంది. ఇంతకీ డీల్ ఏంటంటే రష్యా నుంచి లాంగ్ రేంజ్ వార్నింగ్ రేడార్ వ్యవస్థను భారత్ కొనుగోలు చేయనున్నది. కార్పొరేషన్ కంపెనీ వోరోనేజ్ రాడార్‌లను ఉత్పత్తి చేస్తోంది. ఏరోస్పేస్ ఎక్విప్మెంట్, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ సిస్టమ్స్, రాడార్ల ఉత్పత్తిలో ఆ సంస్థ అగ్రస్థానంలో ఉంది.
మిసైల్స్‌ను ట్రాక్ చేసే సామర్థ్యం పెంచుకోవడంపై ఇప్పుడు భారత్ ఫోకస్ చేసింది. అందుకే సుదీర్ఘ దూరం నుంచి మిసైల్స్‌ను ట్రాక్ చేసే రాడార్లను కొనుగోలు చేయనున్నారు. బాలిస్టిక్ మిసైల్స్, విమానాలను దాదాపు 8 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే వోరోనేజ్ రాడార్ వ్యవస్థ గుర్తిస్తుంది. కొన్ని దేశాల వద్దే ఉన్న ఇలాంటి టెక్నాలజీని ఇప్పుడు భారత్ కూడా సొంతం చేసుకోనుంది.
నిజానికి రష్యా కంపెనీ టీమ్ ఇప్పటికే భారత్‌లో పర్యటించింది. మేకిన్ ఇండియాలో భాగంగా సుమారు 60 శాతం రాడార్ వ్యవస్థను ఇండియన్ కంపెనీల ఉత్పత్తులతోనే నిర్మించనున్నారు. కర్నాటకలోని చిత్రదుర్గలో వీటిని ఇన్‌స్టాల్ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాంతంలో అడ్వాన్స్‌డ్ డిఫెన్స్, ఏరోస్పేస్ ఫెసిలిటీస్ ఉన్నాయి.
ఇదే కాదు రష్యాకు చెందిన మరో యుద్ధనౌక ఇండియన్ నేవీలో చేరింది. ఐఎన్‌ఎస్ తుషిల్‌ను రష్యాలోని కలినిన్‌గ్రాడ్ యంటర్ షిప్‌యార్డులో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జలప్రవేశం చేయించారు. ఐఎన్‌ఎస్ తుషిల్ (ఎఫ్ 70) మల్టీ రోల్ స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్. ఈ యుద్ధనౌక చేరికతో తీరప్రాంత గస్తీలో మరింత మెరుగుదల ఏర్పడనుంది.