స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు గత కొంత కాలంగా జనం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో పలు వెబ్సైట్లు, చానెళ్లు, సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. అయితే, సికింద్రాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఇలాగే భారీ మొత్తంలో మోసపోయాడు. ఏకంగా రూ.1.22 కోట్లు సైబర్ నేరస్తుడి పాలు చేసుకున్నాడు.
బాధితుడు పలు దఫాలుగా స్టాక్మార్కెట్లో పెట్టుబడుల పేరుతో సైబర్ నేరస్తుడికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు. వర్చువల్గా తన యాప్లో డబ్బులు కనిపిస్తుండటంతో నిలువునా మోసపోయాడు. చివరకు మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగించారు. స్టాక్ మార్కెట్ పేరుతో మోసానికి పాల్పడింది ఉత్తర ప్రదేశ్ వాసిగా గుర్తించారు. దీంతో, హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్కు చెందిన ప్రత్యేక బృందం యూపీ వెళ్లి అంకిత్ అరోరా అనే ఆ సైబర్ క్రిమినల్ను అరెస్ట్ చేశారు. అంకిత్ అరోరా.. సికింద్రాబాద్ వాసి నుంచి రూ.1.22 కోట్లు కాజేసినట్లు నిర్ధారించారు. అతని దగ్గర 11 ఏటీఎం కార్డులు, రెండు సెల్ ఫోన్లు, 11 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. అంకిత్ అరోరాపై దేశవ్యాప్తంగా ఇప్పటికే 23 కేసులు నమోదయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.