27.6 C
Hyderabad
Friday, June 26, 2026

Live Video

spot_img

ఒకే వేదికపై రేవంత్‌, కేటీఆర్‌

  • తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ

చెన్నైలో జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల రాజకీయ కార్యాచరణ సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు సీఎం స్టాలిన్‌ అధ్యక్షతన నిర్వహించిన డీ లిమిటేషన్‌పై పోరు సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఒకే వేదికపై కనిపించారు. ఈ అంశం ఇక్కడ తెలంగాణలో ఆసక్తికర చర్చకు దారి తీసింది.

పార్లమెంటు నియోజక వర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగ బోతోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కొంత కాలంగా స్పెషల్‌ క్యాంపెయిన్‌ చేపట్టారు. ఈ క్రమంలోనే చెన్నై వేదికగా దక్షిణాది రాష్ట్రాల ప్రధాన రాజకీయ పార్టీలన్నింటితో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆహ్వానించాలనుకున్న నాయకులందరికీ తమ మంత్రులు, డీఎంకే ముఖ్య నాయకులతో ఆహ్వాన పత్రాలు పంపించారు స్టాలిన్‌. దీంతో, ఆంధ్రప్రదేశ్‌ మినహా దక్షిణ భారతంలోని అన్ని రాష్ట్రాల నుంచి అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, అధికార కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్‌ గౌడ్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఆ పార్టీకి చెందిన నాయకులు నిరంజన్‌ రెడ్డి, జగదీష్‌ రెడ్డి, వినోద్‌కుమార్‌ చెన్నై వెళ్లారు.

వాస్తవానికి రాష్ట్రంలో మాత్రం ప్రతి రోజూ, ప్రతి నిమిషం కాంగ్రెస్, బీఆర్ఎస్ బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు, కేసీఆర్ తీరును రేవంత్ రెడ్డి.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, పథకాలను కేటీఆర్ పరస్పరం విమర్శించుకుంటూనే ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ రూ.లక్ష కోట్లు తిన్నారని అధికార పార్టీ ఆరోపణలు చేస్తుంటే.. మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు ప్రాజెక్టు చేపట్టారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వమే మేలు చేసిందని.. రైతు బంధు, రుణమాఫీ చేసిందని రేవంత్ రెడ్డి చెప్తుంటే.. సగానికి పైగా లబ్ధిదారులకు కాంగ్రెస్ ఇచ్చే పథకాలు అందడం లేదని కేటీఆర్ మండిపడుతుంటారు.

మరోవైపు.. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని అధికార పార్టీ నేతలు అంటుంటే.. రేవంత్ రెడ్డే ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయారంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకే అంశంపై ఏకాభిప్రాయానికి రావడం ఇప్పుడు పెద్దఎత్తున చర్చకు దారి తీసింది. వారిద్దరూ దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి హాజరుకావడంపై సర్వత్రా చర్చ సాగుతోంది.

కాగా, తమిళనాడు సీఎం స్టాలిన్‌ ప్రతిపాదించే జేఏసీలో కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్‌ కూడా భాగస్వామిగా మారితే, ఈ అంశంపై ఇరు పార్టీలూ కలిసి పోరాట కార్యాచరణలో భాగస్వాములు కావాల్సి ఉంటుంది. అదే జరిగితే రాష్ట్రంలో బద్ధశత్రువుల్లా వ్యవహరిస్తున్న అధికార, ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కలిసి పోరాటం చేయాల్సి ఉంటుంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com