సంధ్య ధియేటర్ తొక్కిసలాట కేసులో పుష్ప2 సినిమా నిర్మాతలకు హైకోర్టులో ఊరట లభించింది. సంధ్య ధియేటర్ కేసులో పుష్ప-2 నిర్మాతలైన యలమంచిలి రవిశంకర్, యర్నేని నవీనలను ఏ18లుగా చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో నిర్మాతలు ఇద్దరినీ ఆరెస్ట్ చేయవద్దని హైకోర్టు గురువారం ఆదేశించింది. తొక్కిసలాట కేసులో దర్యాప్తు కొనసాగించడానికి అనుమతించిన కోర్టు నిర్మాతలిద్దరినీ మాత్రం అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. డిసెంబర్ 4వ తేదీ పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య ధియేటర్ ఆవరణలో తొక్కిలసలాట జరిగి రేవతి అనే మహళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ ఆ రోజు నుంచి ఆపస్మారక స్ధితిలో ఉండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీంతో ధియేటర్ యాజమాన్యంతో పాటు బాధ్యులైన సిబ్బంది, సినిమా హీరో అల్లు అర్జున్, హీరో వ్యక్తిగత సిబ్బంది, నిర్మాణ సంస్ధ అయిన మైత్రీ మూవీస్ పై కేసు నమోదు చేసింది. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయగా ఆయన మధ్యంతర బెయిల్ పై కొనసాగుతున్నారు. తాజాగా నిర్మాతలు కోర్టును ఆశ్రయించగా నిర్మాతలిరువురినీ అరెస్ట్ చెయ్యద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.