ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కి విజ్ఞప్తి చేసిన ఉప ముఖ్యమంత్రి భట్టి
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వివిధ ఆర్థిక వనరులను విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖా మంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. శనివారం ఢిల్లీలోని సప్ధర్ జంగ్ రోడ్డులో ఉన్న నిర్మలా సీతారామన్ నివాసంలో ఆమెతో డిప్యూటీ సీయం భేటీ అయ్యారు. అనేక పధకాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఆర్థిక మంత్రికి విజ్ఞాపన పత్రాలను భట్టి విక్రమార్క అందచేశారు. అలాగే పలు కార్పొరేషన్‌లకు రుణ పునర్‌వ్యవస్ధీకరణ కోసం ఆర్థిక సంస్ధలకు మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్ర మంత్రిని డిప్యూటీ సీయం కోరారు. ఇక తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 4,08,48,54,461 తిరిగి చెల్లింపును వేగవంతం చేయాలని కోరారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్ధీకరణకు చట్టం 2014 కింద, విభాగం 94(2) ప్రకారం, తెలంగాణకు రావలసిన వెనుకబడిన జిల్లాల కోసం ప్రత్యేక సహాయ నిధి విడుదల చేయాలని విన్నవించారు. 2014- – 15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం ప్రాయోజిత పథకాల నిధుల విడుదలలో జరిగిన పొరపాటు సరిచేయాలని విజ్ఞప్తి చేశారు. దీనితో పాటు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 లోని విభాగం 56(2) ప్రకారం రూ. 208.24 కోట్లు తిరిగి చెల్లించాలని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు కేటాయించిన అదనపు బాద్యత మేరకు అందుకోవలసిన మొత్తానికి సంబంధించిన అంశం పైన చర్చించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పవర్ యుటిలిటీల మధ్య పెండింగ్‌లో ఉన్న బకాయిల పరిష్కారం చేయాలని కోరారు. డిప్యూటీ సీఎం వెంట స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్ తదితరులు ఉన్నారు.