- బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం
- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్న అసెంబ్లీ
- పలు కీలక బిల్లులను తీర్మానాలను సభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- హామీల అమలు చేయలేదంటున్న బీఆర్ఎస్
- బీసీల్లో మైనార్టీలను కలిపితే మద్దతు ఉండదు అంటున్న బిజెపి
- తొలి రోజు సమావేశానికి హాజరుకానున్న కెసిఆర్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమయ్యే సమావేశాలు ఈనెల చివరి వరకు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలు కావడం చేత అనేక ప్రధాన అంశాలు ఈసారి చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఈసారి అందరి దృష్టి సమావేశాలకు ప్రతిపక్షనేత కేసిఆర్ హాజరవుతారా లేదా అనే అంశం మీదే ఉంది. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతున్నట్లుగా పార్టీ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. బుధవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగానికి అసెంబ్లీకి కేసీఆర్ రానున్నారు. అయితే పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలకు అయినా వచ్చే అవకాశం లేదు.
ఇరిగేషన్, రెవెన్యూ వంటి అంశాలపై అవసరమైతే కేసీఆర్ సభలో స్పందించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై మంగళవారం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ హామీలను అమలు చేయని ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు. టిఆర్ఎస్ తో పాటు బిజెపి కూడా అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు బిఆర్ఎస్, బిజెపిలో సిద్ధమయ్యాయి. 14 నెలల కాంగ్రెస్ పాలన వైఫల్యాలే అజెండాగా సభలో సమరానికి విపక్షాలు సై అంటున్నాయి. ఆరు గ్యారంటీల్లో ఫ్రీ బస్ మినహా ఏది సరిగా అమలు చేయలేదని రాష్ట్రంలో రైతు సమస్యలపై సమగ్ర చర్చకు పట్టు బట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.
లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే సర్కారు గతేడాది పద్దుల కేటాయింపులు నామమాత్రంగా ఖర్చు చేసిందని బీజేపీ ఆరోపిస్తోంది. ఆచరణ సాధ్యమయ్యేలా గ్యారంటీలు అమలయ్యేలా బడ్జెట్ ప్రవేశపెట్టాలని కాషాయ పార్టీ డిమాండ్ చేస్తోంది. తెలంగాణలో రైతు రుణమాఫీ 100 శాతం పూర్తి కాలేదని రైతు భరోసా అతి కొద్దీ మందికి మాత్రమే వేసి చేతులు దులుపుకున్నారని సభలో వీటిపై ప్రధాన చర్చకు బిఆర్ఎస్ బిజెపిలో డిమాండ్ చెయ్యనున్నాయి. ఎండిన పంటలకు నష్ట పరిహారంతో పాటు రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతుంది.
కాంగ్రెస్ ఎన్నికల హామీలైన ఫించన్ పెంపు, మహిళలకు 2500, యువతులకు స్కూటీ, ఉద్యోగ క్యాలెండర్ జాడ ఏది అంటూ నిరసన తెలిపేందుకు కాషాయ ఎమ్మెల్యేలు కంకణం కట్టుకు కూర్చొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన వైఫల్యాలపై చర్చలో తగిన సమయం కేటాయించాలని అవసరమైతే బడ్జెట్ సమావేశాలు పొడిగించాలని డిమాండ్ చేస్తామని కమలం నేతలు అంటున్నారు.
మరవైపు విపక్షాల వాదనను బలంగా తిప్పికొట్టేందుకు అధికార పార్టీ కూడా సిద్ధమైంది. ప్రజకి ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటిని దశలవారీగా అమలు చేస్తున్నామని రాష్ట్ర ఆర్థిక అంతగా బాగు లేకపోయినా పాలన కొనసాగిస్తున్నామని కాంగ్రెస్ అంటుంది. మరోవైపు బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీ కులగణన ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇరిగేషన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విద్యా విధానం డిలిమిటేషన్ వంటి అంశాలపై సమావేశాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎస్సీ వర్గీకరణకు మద్ధతు ఉంటుందని ఇప్పటికే బీఆర్ఎస్ బిజెపిలో తెలిపాయి.. కులగణన మాత్రం తప్పుల తడక ఉందని ముస్లింలకు అదనంగా ఇచ్చిన రిజర్వేషన్లు తొలగిస్తేనే మద్ధతు ఇస్తామని బీజేపీ అంటోంది. కేంద్రం నిధులు ఇవ్వట్లేదని సీఎం వ్యాఖ్యలపై నిరసనలు, రాష్ట్రంలో ఎస్ ఎల్ బీసీ ప్రమాదం సహా తాజా పరిణామాలను సభలో లెవనెత్తే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి రెండు వారాలపాటు జరిగే సమావేశాలు ఈసారి హాట్ హాట్ గా జరిగే అవకాశం ఉన్నాయి.