రైతు భరోసా పథకంలో భాగంగా మూడు ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్న లబ్ధిదారులకు వెంటనే నిధులు మంజూరు చేయండని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శుక్రవారం ఉదయం ప్రజాభవన్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామ కృష్ణారావు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందిన రైతుల వివరాలను గ్రామాల్లో ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుల పేర్లు అందరికీ కనిపించేలా, గ్రామాల ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేయాలని సూచించారు.
గత ప్రభుత్వ హయంలో రైతు భరోసా పంపిణీలో అవకతవకలు జరిగాయని, తిరిగి పొరపాట్లు దొర్లకుండా ప్రజా ప్రభుత్వం అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వర్తింప చేస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. మొదటి రెండు విడతల్లో రైతు భరోసా కింద లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకు ఖాతాల్లో జమ అయిందన్నారు.