29.7 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

కాంగ్రెస్ మార్క్ కు భిన్నం… మీనాక్షి నటరాజన్ రాక

కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్‌ లో పిసిసి అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, పిసిసి ప్రోటోకాల్‌ చైర్మన్‌ హర్కర వేణుగోపాల్‌, హైదరాబాద్‌ డిసిసి అధ్యక్షుడు రోహిణ్‌ రెడ్డి తదితరులు మీనాక్షికి స్వాగతం పలికారు. కాంగ్రెస్ సామాన్య కార్యకర్త మాదిరిగా బ్యాగుతో వచ్చిన మీనాక్షి నటరాజన్  గాంధీభవన్ లో జరిగే పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు.

రాష్ట్ర వ్యవహారాలు అప్పచెప్పాక మొదటి సారి వచ్చిన మీనాక్షి…పార్టీ నేతలకు, శ్రేణులకు తన విధానాలు ఏంటో చెప్పకనే చెప్పారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గతంలో హైదరాబాద్‌ వస్తే విమానాశ్రయం నుంచి గాంధీభవన్‌ వరకు ఫ్లెక్సీల జాతర జరిగేది. రోడ్డు పొడవునా అగ్రనేతల నుంచి చోటా మోటా నేతల వరకు ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసేవారు. పండుగ వాతావరణం ఉండేది.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి వస్తున్నారంటే…ముఖ్యమంత్రి స్థాయిలో స్వాగత, సత్కారాలు ఆడంబరంగా నిర్వహించేవారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అనుకున్నంత మెరుగ్గా లేదని, రాష్ట్ర స్థాయి నేతలు క్షేత్రస్థాయి సమస్యలు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు, ఫిర్యాదులు అధిష్టానానికి లెక్కకు మిక్కిలి చేరాయి.

పార్టీని గాడిలో పెట్టకపోతే కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఒక్కటైన తెలంగాణ కూడా చేజారే పరిస్థితి ఉందని అధిష్టానానికి బెంగపట్టుకుంది. దీంతో నిక్కిచ్చిగా వ్యవహరించే మీనాక్షికి రాష్ట్ర వ్యవహారాలు అప్పచెప్పారని టాక్.

వీటన్నింటికీ భిన్నంగా మీనాక్షి రాష్ట్రానికి వచ్చే ముందే పీసీసీ అధ్యక్షుడికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తనకు స్వాగతం పలుకుతూ ఒక్క బ్యానర్‌, ఫ్లెక్సీ కూడా అవసరం లేదని ఖరాఖండిగా చెప్పారని సమాచారం. స్టార్‌ హోటల్లో బస, హంగు ఆర్భాటాలు అక్కర లేదని చెప్పారట.

దీపాదాస్‌ మున్షీని తప్పించి మీనాక్షికి బాధ్యతలు అప్పగించిన రోజు రాష్ట్రానికి చెందిన పలువురు అగ్రనేతలు ఢిల్లీలోనే ఉన్నారు. విషయం తెలియటంతో ఆమెను అభినందించేందుకు నేతలు పోలోమని వెళితే అక్కడే వారిని నిలువరించినట్టు తెలిసింది. ఏ విషయాలైనా గాంధీభవన్ లో లేదంటే పిసిసి సమావేశంలోనే మాట్లాడుదామని చెప్పి పంపినట్టు నేతలు చెప్పుకుంటున్నారు.

మధ్యప్రదేశ్ లోని మందసర్ పార్లమెంటు స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన మీనాక్షి…ముక్కుసూటిగా వ్యవహరిస్తుందని పేరుంది. మధ్యప్రదేశ్ లో దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్ తదితర అగ్రనేతల గ్రూపుల్లో చేరకుండా పార్టీ కోసం పనిచేశారని పార్టీలో చెప్పుకుంటారు. రాహూల్ గాంధీకి సన్నిహితురాలిగా చెప్పుకుంటారు.

ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు… పార్టీ అధికారంలోకి వచ్చాక విపక్షాల ఆరోపణలకు స్పందించటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒకటి రెండు పథకాలు మినహా ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేస్తున్నా.. ప్రజల్లో సానుకూలత రావటం లేదని అధిష్టానానికి రిపోర్టులు అందాయి. ప్రభుత్వ విధానాలపై సీఎం, ఉపముఖ్యమంత్రి, మంత్రులు శ్రీధర్ బాబులు తప్పితే మిగతా వారు సబ్జెక్టు మీద మాట్లాడటం లేదని పార్టీ నేతలే వాపోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ రాజకీయాలను మీనాక్షి ఏ విధంగా దారిలోకి తీసుకొస్తారో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com