27.7 C
Hyderabad
Monday, May 25, 2026

Live Video

spot_img

మరో నాలుగు రోజుల్లో వర్షాలే వర్షాలు

తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా రానున్న నాలుగు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం, శనివారాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది. హైదరాబాద్‌ సహా పరిసర ప్రాంతాల్లో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా వాతావరణం చల్లబడినట్లు భావిస్తున్నారు. హైదరాబాద్‌లోని లంగర్‌హౌజ్‌లో అత్యధికంగా 58 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందిగా, రాజేంద్రనగర్‌లో 57.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

రానున్న నాలుగు రోజులలో నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దీంతోపాటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్షాల ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉండొచ్చని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, నైరుతి రుతుపవనాలు ఇప్పటికే ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయని వెల్లడించారు. రానున్న 3–4 రోజుల్లో ఇవి దక్షిణ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాల్లోకి విస్తరించేందుకు అనుకూల పరిస్థితులున్నాయని వివరించారు. ఈ నెలాఖరులోగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని, ఇవి సాధారణం కంటే నాలుగు రోజులు ముందుగానే వచ్చే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com