23.8 C
Hyderabad
Wednesday, July 29, 2026

Live Video

spot_img

రైతులు ప్రశ్నిస్తారని రాహుల్ గాంధీ భయపడ్డారు – ఎమ్మెల్సీ కవిత

వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. వరంగల్ లో రాహుల్ గాంధీ చెప్పిన రైతు డిక్లరేషన్ అమలే కాలేదన్నారు. తెలంగాణ జాగృతి మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలతో హైదరాబాద్ లో ఈ రోజు జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

వరంగల్ డిక్లరేషన్ పై రైతులు ప్రశ్నిస్తారని రాహుల్ గాంధీ భయపడ్డారని..ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ఊరుకోబోరని కవిత హెచ్చరించారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

ఇక్కడి కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మడం లేదని ఎన్నికలప్పుడు ఢిల్లీ నుంచి నాయకులను తీసుకొచ్చారని కవిత ఆరోపించారు. సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ వచ్చి చిలుక పలుకులు పలికారని..రేవంత్ రెడ్డి ముఖం కాదు… సోనియా, ప్రియాంకా, రాహుల్ గాంధీల ముఖం చూసి మహిళలు కొంత వరకు ఓట్లు వేశారన్నారు.

అధికారంలోకి వచ్చి 14 నెలలు అయినా మహిళలకు 2500 ఇవ్వడం లేదని కవిత విమర్శించారు. రేవంత్ రెడ్డి మహిళలకు రూ 35 వేల చొప్పున బాకీ పడ్డారని, రూ. 35 వేలను ప్రతీ మహిళా బ్యాంకు ఖాతాలో జమా చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మార్చి 8న మహిళా శంఖారావం నిర్వహిస్తున్నామని కవిత వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేని పరిస్థితి నెలకొందని, రేవంత్ రెడ్డి పాలనలో క్రైమ్ రేటు 20 శాతం పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆడపిల్ల కాలేజీకి వెళ్తే ఇంటికొచ్చే వరకు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడిందన్నారు.

శివారు ప్రాంతాల్లోని ఇళ్లలో దొంగలు చెలరేగుతున్నారని, కేసీఆర్ పదేళ్ల పాలనలో ఒక్క మతకల్లోలం జరగలేదని కవిత గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎక్కడో ఒక చోట తరుచూ మతకల్లోలాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో 70 శాతం పనిచేయడం లేదని మండిపడ్డారు.

భద్రత కోసం కూడా మహిళలు పోరాటం చేయాల్సిరావడం బాధాకరమని కవిత వ్యాఖ్యానించారు. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామని రేవంత్ రెడ్డి మోసం చేశారని, కేసీఆర్ పై అక్కసుతో కేసీఆర్ కిట్ లను నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వ ఆస్పత్రులపై శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి బస్సుల సంఖ్యను తగ్గించారని, బీడీ కార్మికులకు పెన్షన్ ను 4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. తక్షణమే దాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com