విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న ప్రఖ్యాత కనక దుర్గమ్మ దేవాలయం సేవలు వాట్సప్‌లో అందుబాటులోకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రారంభించిది. పౌరసేవలను సులభతరం చేయడమే వాట్సప్ గవర్నెన్స్ ఉద్దేశ్యమని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. ప్రభుత్వ సర్వీసులను ‘95523 00009 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా అందిస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే ఏపీలో రెండో ప్రధాన దేవాలయం అయిన విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దర్శనాలు, సేవలు బుక్ చేసుకోడానికి, విరాళం అందించడాన్ని దేవాదాయ శాఖ సులభతరం చేసింది. ప్రతి ఒక్కరూ సులభంగా అర్ధం చేసుకునేలా 9552300009 వాట్సాప్ నెంబర్ కు ‘HI’ అని వాట్సప్ లో మెసేజ్ చేయడం ద్వారా సేవలు అందుకోవచ్చునని ఆలయ ఈవో కె.రామచంద్ర మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇప్పటికే మన మిత్ర పేరుతో వాట్సప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. 150కిపైగా సేవలు ఈ ప్లాట్‌ఫామ్ నుంచి ప్రజలు పొందవచ్చని పేర్కొంది. బస్ టికెట్లు మొదలు కొని క్యాస్ట్, ఇన్‌కం సర్టిఫికేట్, దేవాలయాల దర్శనాలు ఇలా 161 సేవలు లభిస్తాయి. కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటి వద్ద నుంచి ఒక్క క్లిక్‌తో చాలా సేవలు లభించనున్నాయి.