28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

పుష్ప2 చుట్టూ పొలిటికల్ వార్

  • ఇండస్ట్రీ హిట్ టాక్ తో సంబరాలు చేసుకుంటున్న అభిమానులు
  • అబ్బే బొమ్మ యావరేజే అంటున్న మెగా ఫాన్స్
  • ప్రపంచ వ్యాప్తంగా హిట్ టాక్ తెచ్చుకున్న పుష్ప2

సాధారణంగా ఒక సినిమా కారణంగా ఫ్యాన్ వార్లు జరగడం మనం ఇంతకాలం చూశాం. కానీ ఒక సినిమా వల్ల పొలిటికల్ వార్ జరగడం అల్లు అర్జున్ ’పుష్ప‘ సినిమాతోనే చూస్తున్నాం. వాస్తవానికి అల్లు అర్జున్ ఇంతవరకూ ఏ పొలిటికల్ పార్టీని భుజాన వేసుకుని మోయలేదు. అయితే అల్లు అర్జున్ ఆవిధంగా రాజకీయ పార్టీలతో టచ్ మీ నాట్ అని ఉండటం జనసేన కార్యకర్తలకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు మొదటి నుంచీ నచ్చడం లేదు. ఒక సినిమా ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని ఆయన అభిమానులు అరుస్తుంటే ’నేను మాట్లాడను బ్రదర్‘ అంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో చీలిక తెచ్చింది. అప్పటివరకూ అటు చిరంజీవి కుటుంబం నుంచి ఉన్న హీరోలు కానీ ఇటు అల్లు అరవింద్ కుటుంబం నుంచి వచ్చిన హీరోలు కానీ… అందర్నీ ’మెగా‘ గాటనే కట్టేసేవారు. ఈ అందరు హీరోలను మెగా హీరోలుగానే అభిమానులు చూసేవారు. అయితే అల్లు అర్జున్ ఎప్పుడైతే నేను మాట్లాడను బ్రదర్ అని వేదిక మీద నుంచి అన్నారో ఆ రోజు నుంచి చిరంజీవి కుటుంబం నుంచి అల్లు అర్జున్ని వేరు చేసి చూడటం ప్రారంభించారు మెగా అభిమాను. దీనికి తోడు పలు సందర్భాల్లో అందరు హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు నాకు ఆర్మీ ఉందని తన ఫ్యాన్స్ ను అర్మీతో పోల్చి అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ లో కాకపుట్టించడమే కాకు మరింత దూరాన్ని పెంచాయి.

సినిమా హీరోల పరంగా ఈ విధంగా ఫ్యాన్ వార్ సర్వ సాధారణం. అయితే అల్లు అర్జున్ మధ్య మెగా అభిమానుల మద్య కొనసాగుతున్న దూరం సినిమాల వరకూ పరిమితం కాలేదు. మొన్న మేనెలలో జరిగిన ఎన్నికల సందర్భంగా రాజకీయ వైరంగా మారింది. చిలికి చిలికి గాలి వానగా మారినట్లు అల్లు అర్జున్ పతనం కోరుకునేంతగా మెగా అభిమానులు అతనిపై కక్షగట్టారు. దీనికి కారణం అల్లు అర్జున్ వైఎస్సార్సీపీ తరపున శాససభ్యునిగా పోటీ చేస్తున్న తన మిత్రుడి మద్దతు ప్రకటించడమే. మద్దతు అంటే ఏదో నోటి మాటగా కాకుండా స్వయంగా తన మిత్రుడైన శిల్ప రవికిషోర్ రెడ్డి నంద్యాల ఇంటికి వెళ్లి మరీ మద్దతు ప్రకటించడం మెగా ఫ్యాన్స్ అస్సలు తట్టుకోలేకపోయారు. ఈ పరిణామం ఇద్దరి మధ్య పూడ్చలేని అగాధం సృష్టించింది. అదే సమయంలో జనసేనలో విపరీతమైన యాక్టీవ్ గా ఉన్న మెగా సోదరుడు నాగబాబు చేసిన ట్వాట్ అభిమానుల మధ్య మరింత దూరాన్ని పెంచి ఒక యుద్ద వాతావరణాన్ని నెలకొల్పింది. అల్లు అర్జున్ నంద్యాలలోని శిల్ప రవికిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లిన మరుసటి రోజు ’మతో ఉంటూ ప్రత్యర్ధులు పనిచేసేవాడు మా వాడైనా పరాయి వాడే‘ అంటూ నాగబాబు చేసిన ట్వీట్ పెద్ద దుమారాన్నే రేపింది. ఊహించని దానికంటే ఆ ట్వీట్ ఎక్కువ రప్చర్ చేయడంతో నాగబాబు వెంటనే ఆ ట్వీట్ ను తొలగించారు. తాను పెట్టిన ట్వీట్ ని అయితే తొలగించారు కానీ ఆ ట్వీట్ కారణంగా మెగా, అల్లు అర్జున్ అభిమానుల మధ్య రాజుకున్న నిప్పుని మాత్రం నాగబాబు ఆర్పలేకపోయారు.

ఓ పక్కన చావో రేవో అన్నవిధంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో కొట్లాడుతున్నాడు. తన గెలుపు ఒక ఆత్మాభిమాన సమస్యగా అభిమానులందరి హృదయాల్లో బలంగా నాటుకునేలా చెయ్యగలిగారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డితో రాజకీయ పోరాటం కాకుండా ఒక యుద్దమే చేస్తున్నట్లుగా మెగా అభిమానులందరినీ తీర్చిదిద్దారు పవన్ కళ్యాణ్. అయితే అంతటి యుద్దంలో అల్లు అర్జున్ తమ వైపు నిలబడకపోగా శత్రువుకు మేలు జరిగే విధంగా నంద్యాల వెళ్లి మరీ వైఎస్సార్సీపీ అభ్యర్ధికి మద్దతు ప్రకటించడం మొగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇక అప్పటి నుంచి ఇద్దరి అభిమానుల మధ్యా సంబందాలు పూర్తిగా తెంచేసుకుని కుండలు బద్దలు కొట్టేసుకున్నారు. ఏ సందర్భం వచ్చినా అల్లు అర్జున్ని ట్రోల్ చెయ్యడం ప్రారంభించారు. రిలీజ్ అయ్యే అల్లు అర్జున్ ప్రతి సినిమాను ఫ్లాప్ చెయ్యాలని కంకణం కట్టుకున్నారు. ఇదేదో తెరవెనుక చెయ్యాలనుకోలేదు మెగా ఫ్యాన్స్ బహిరంగంగానే యుద్దం ప్రకటించారు. అల్లు అర్జున్ పుష్ఫ 2 సినిమాను ఫ్లాప్ చేసి చూపిస్తామని మెగా ఫ్యాన్స్ లేకపోతే అల్లు అర్జున్ ఎక్కడ అని మీడియా మైకుల ముందుకు వచ్చి మరీ చెప్పారు. ఇంతకాలం మెగా అభిమానులు మొయ్యడం వల్లే అల్లు అర్జున్ సిమాలు సూపర్ హిట్లు అయ్యాయని… ధియేటర్లు మాతోనే నిండేవని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో కొంత లైన్ క్రాస్ చేసి మరీ అల్లు అర్జున్ని ట్రోల్ చెయ్యడం ప్రారంభించారు మెగా అభిమానులు.

అభిమానుల మధ్యే ఈ అగాధం తప్పితే మెగా హీరోలు అందరూ పుష్ప 2కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయితే నాగబాబు మాత్రం యధావిధిగా డొంకతిరుగుడుగానే ఎక్స్ వేదికగా స్పందిచారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రీమియర్ షో టిక్కెట్ల ధర పెంచుకోవడానికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ సహకరిండడం కూడా జరిగింది. అయినా ఫ్యాన్స్ కి మాత్రం అల్లు అర్జున్ పై మంట తగ్గలేదు. అయితే మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్ ని, హెచ్చరికల్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన సినిమాని రిలీజ్ చేసుకుని ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అల్లు అర్జున్. విచిత్రమేంటంటే గురువారం పుష్ప ఆడుతున్న ధియేటర్ల వద్దకు పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చి సినిమా అట్టర్ ఫ్లాప్ అని, రన్ టైమ్ ఎక్కువగా ఉందని, యావరేజ్ గా ఉందని మీడియాకు బైట్లు ఇస్తున్నారు. అది కూడా టీడీపీ మద్దతుదారు అయిన ఓ శాటిలైట్ ఛానల్ కే ఇటువంటి బైట్స్ ఎక్కువగా ఇస్తున్నారు.

సినిమా అభిమానుల మధ్య ఈ విధంగా యుద్దం నడుస్తుంటే టీడీపీ, వైఎస్సార్సీపీ పార్టీ క్యాడర్ మధ్య కూడా సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. పుష్ప సినిమా హిట్ అయతే అదేదో వైఎస్సార్సీపీ విజయం సాధించినట్లు, ఫెయిల్ అయితే టీడీపీ, జనసేన ఉమ్మడిగా విజయం పొందినట్లుగా ఫీలై పోస్టులు పెడుతున్నారు. ఎక్స్, ఇన్ స్టా, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల వేదికగా మూడు రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య మాటల యుద్దాలు జరుగుతున్నాయి. కంటెంట్ ఉన్నోడికి కటౌటే చాలు అని పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ ఉన్నట్లుగా పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రిలిజై రికార్డు స్ధాయి వసూళ్ళు చేస్తోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పేరెన్నికగన్న జాతీయ స్ధాయి సినీ సమీక్షకులు పుష్ప2 కి 4.5 రేటింగ్ ఇవ్వడం. ఇటీవల కాలంలో అందునా పాన్ ఇండియా సినిమకి ఇటువంటి రేటింగ్ రావడం ఇదే ప్రధమమని అల్లు అర్జున్ అభిమానులు కాలరెగరేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com