సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్ ను శనివారం మధ్యహ్నం అరెస్ట్ చేయడం, గాంధీ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టడం, అక్కడ 14రోజుల రిమాండ్ విధించడం… చంచల్‌గూడ జైలుకు తరలించడం అన్నీ చకచకా జరిగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఒకవైపు ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే… సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని లాయర్ల బృందం హైకోర్టులో లంచ్ మోషన్ ద్వారా సుదీర్ఘ వాదనల అనంతరం కోర్టు అల్లు అర్జున్ కి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ కోర్టు నుండి బెయిల్ పేపర్లు అందడం ఆలస్యం అయ్యందంటూ గతి రాత్రి అల్లు అర్జున్ని విడుదల చెయ్యకుండా చంచల్‌గూడ జైలులోనే ఉంచారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు ఖైదీ నెం:7697 ను జైలు అధికారులు కేటాయించి, మంజీరా బ్లాక్ లోని ప్రత్యేక బ్యారెక్ లో ఉంచారని సమాచారం. అయితే నిన్న జైలు అధికారులకు బెయిల్ పేపర్లు స్వయంగా తీసుకువెళ్ళి ఇచ్చినా వాటిలో స్పష్టత లేదని అల్లు అర్జున్ విడుదలలో కావాలనే జాప్యం చేశారని ఆయన లాయర్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై అల్లు అర్జున్ లాయర్లు జైలు అధికారులపై కంటెప్ట్ ఆఫ్ కోర్టు కింద కోర్టులో కేసు ఫైల్ చేయాలని నిర్ణయించారు.