37.2 C
Hyderabad
Wednesday, April 22, 2026

Live Video

spot_img

అవతల పుష్పా ఇన్ ట్రబుల్స్.. మరిటు మాట్లాడరేమి?

పవర్ స్టార్.. ఇంత మౌనమేలనోయి?

పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన ఘటనల నేపధ్యంలో స్పందన కోసం తెలుగు రాష్ట్రాలు రెండూ ఉత్కంఠగా గమనిస్తున్న వ్యక్తి ఒకరున్నారు. ఆయనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. అల్లు అర్జున్, వర్సెస్ తెలంగాణ సర్కార్ వివాదం చినికి చినికి గాలి వానగా మారుతున్నా.. మెగా కుటుంబానికి చెందిన పవన్ కల్యాణ్ తన బంధువర్గం ఇన్ వాల్వ్ అయిన ఈ కేసులో ఇప్పటి వరకూ నోరు మెదపక పోవడానికి కారణం ఏమై ఉంటుందన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. దీనిపై ఇప్పటి వరకూ కనీసం ఒక్క సారిగా కూడా పబ్లిక్ గా గానీ, ప్రైవేట్ సంభాషణల్లో కానీ ఏ విధమైన స్పందనా  ఆయన నుంచి లేదు.  పొరుగు రాష్ట్రంలో తన బంధువర్గానికి ఇంత కష్టం వచ్చినా జనసేనాని గిరిజనుల మధ్యసేద తీరుతూ, వారితో నృత్యాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా… మరెంతో ఉల్లాసంగా కనిపించారు.

చిరు, నాగబాబు సంఘీభావం

డిసెంబర్ 4 ఘటన తర్వాత అల్లూ అర్జున్ ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడంతో ఆరోజంతా హై డ్రామా నడిచింది. అర్జున్ ఇంటికి పోలీసులొచ్చారని, ఆయన్ను అరెస్టు చేసి తీసుకు వెళ్లారన్న వార్త దావానలంలా వ్యాపించింది. మెగా ఫ్యామిలీ దీనిపై వెంటనే స్పందించింది. విశ్వంభర షూటింగ్ కు బయల్దేరుతున్న చిరంజీవి అది రద్దు చేసుకుని అల్లూ అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఆయన భార్యసురేఖ సహా బంధు వర్గం అంతా అల్లూ అర్జున్ కు అండగా నిలబడింది. సోదరుడు నాగబాబు కూడా  తన భార్యతో అక్కడకు చేరుకున్నారు. సంఘీభావం ప్రకటించారు. వాస్తవానికి చిరంజీవి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు కూడా వద్దామనుకున్నారు. కానీ పోలీసులు క్రౌడ్ ఉందని ఇబ్బందులు వస్తాయని చెప్పడంతో అల్లూ అర్జున్ ఇంటికే చేరుకుని అక్కడ నుంచే పరిస్థితిని సమీక్షించారు. మధ్యా హ్నానికే అనూహ్య వాతావరణం కనపడటం నాంపల్లి కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేసిందని, క్వాష్ పిటిషన్ కూడా కష్టమేనని అల్లూ కుటుంబానికి అర్దమయ్యింది. అల్లూ అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి హుటాహుటిన రంగంలోకి దిగి లాయర్లను మోహరించడం వారి సాయంతో హైకోర్టు తలుపు తట్టడం జరిగాయి. చివరకు రెగ్యులర్ బెయిల్ కు బదులు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఇంత హైడ్రామా ఇక్కడ నడుస్తుంటే పవన్ కల్యాణ్ మాత్రం అసలు ఫ్రేమ్ లోకే రాలేదు. చివరకు ఏపీ సీఎం చంద్రబాబు సైతం ఈ ఘటనలపై ఎప్పటికప్పుడు సమీక్షించినా పవన్ మాత్రం ఎందుకో దూరంగానే ఉండిపోయారు. పైగా అర్జున్ అరెస్టు తప్పదని తేలడంతో మంగళగిరి నుంచి ఆయన హుటాహుటిన హైదరాబాద్ ప్రత్యేక విమానంలో వస్తున్నట్లు డిజిటల్ మీడియాలో రకరకాల కథనాలు  కనిపించాయి. ఆయన నేరుగా అర్జున్ దగ్గకు వెళతారని కాసేపు, అల్లు అర్జున్ ఇంటికే వస్తారని కాసేపు ఇలా  రకరకాల పుకార్లు షికారు చేశాయి. కానీ ఆయన మాత్రం దర్శనమియ్యలేదు. బెయిల్ దొరికినా సాంకేతిక కారణాల వల్ల అర్జున్ ఆరాత్రికి జైల్లోనే ఉండాల్సి రావడం అటు అల్లు అర్జున్ అభిమానుల్లోనూ, కుటుంబ వర్గాల్లోనూ కలవరం పెంచింది. రాత్రి పదకొండు దాటినా తమ అభిమాన హీరో బయటకు వస్తారని చంచల్ గుడా జైలు ముందు అభిమానులు వేచి చూశారంటేనే మెగా అభిమానులు సైతం ఈ పరిణామాలను దిగమింగుకోలేదని అర్ధమవుతోంది. మరి ఇంత కష్ట సమయంలో పవన్ కల్యాణ్ మాత్రం కనపడలేదు సరికదా కనీసం ఓ స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదు.

ఆయనొక్కరు తప్ప..

బెయిల్ పై మరుసటి రోజు ఉదయం విడుదలై ఇంటికొచ్చిన అల్లూ అర్జున్ ను చిరంజీవి దంపతులు,  నాగబాబు సహా అందరూ వచ్చి కలిశారు. ఇక ఇండస్ట్రీ మొత్తం అక్కడ రెక్కలు కట్టుకు వాలిపోయింది. కానీ  మెగా ఫ్యామిలీకే చెందిన పవన్ జాడ మాత్రం కనపడలేదు. ఈ సంఘటనపై పవన్ వైఖరి ఏంటన్నది తెలియకుండా పవన్ జాగ్రత్త పడ్డారా? లేక మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? నార్మల్గా అయితే మెగా ఫ్యామిలీ ఫంక్షన్లలోనూ, ఇతర కీలక సందర్భాల్లోనూ  పవన్ లేని సమయంలో ఆయన భార్య హాజరైనా కనపడేది.. కానీ ఈసారి ఆమె కూడా కనిపించలేదు. మరి పవన్ ఉద్దేశ పూర్వకంగానే ఇలా దూరం పాటిస్తున్నారా? అన్నది తేలడం లేదు.

సోషల్ మీడియా కథనాలు

అల్లు అర్జున్ బెయిల్ పై వచ్చాక తన భార్యతో కలసి మరుసటిరోజు మెగాస్టార్ ఇంటికి వెళ్లారు. అక్కడ గంటన్నరపాటు ఉండి లంచ్ కూడా చేశారు. ఆపై నాగబాబు ఇంటికెళ్లి అక్కడ కూడా కొంత సమయం గడిపారు. అల్లూ ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి దూరం పెరిగిందన్న రూమర్లన్నింటికీ దీనితో చెక్ పెట్టారు. అదే సమయంలో అమరావతిలో ఉన్న పవన్ ను కలిసేందుకు కూడా అల్లు అర్జున్ ప్రయత్నించాడని అయితే సాధ్యపడలేదన్నది అనఫీషియల్ వర్గాల టాక్.. పవన్ కు సన్నిహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వారా పవన్ కు ఫోన్ చేయించారని అయినా కనీసం లైన్ లోకి కూడా రాలేదని వార్తలొచ్చాయి. ఆ తర్వాత చాలా సేపటికి లైన్ లోకి వచ్చినా.. విషయం వివరించాక నిర్ణయం కూడా వెంటనే చెప్పలేదని.. చాలా సేపు తాత్సారం చేసిన తర్వాత కలవడం ఇప్పుడు సాధ్యం కాదని మధ్యవర్తులతో  చెప్పించారని సమాచారం. వీటిపై అటు రెండు కుటుంబాలు కానీ, అర్జున్ వైపునుంచి కానీ ఎలాంటి వివరణా బయటకు రాలేదు. ఇది నిజమో అబద్ధమో కూడా వారు తేల్చలేదు.

ఇక అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్ ఈ ఇష్యూని రైజ్ చేయడం ఒక ఎత్తయితే.. దానిపై సీఎం రేవంత్ అనూహ్యంగా మాటల దాడికి పాల్పడటం మరో ఎత్తు. చివరకు ఈ వివాదం  ఇండస్ట్రీ వర్సెస్ తెలంగాణ  ప్రభుత్వంగా మారిపోతున్నసందర్భంలోనూ పవన్ స్పందించలేదు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయు జేఏసి రాళ్ల దాడి చేసినా ఆయన ఖండన కూడా లేదు. యధాప్రకారం ఏజెన్సీ ఏరియాలో గిరిజనంతో గడిపేశారు.

 జగన్ ప్రభుత్వంపై ఒంటికాలి మీద…

ఇప్పుడిక వివాదం విభజన అంశం రూపు తీసుకుంటున్నా.. పవన్ మాత్రం నోరు మెదపడం లేదు. గతంలో జగన్ ప్రభుత్వం టిక్కెట్ రేట్లు  తగ్గించినప్పుడు మాత్రం ఓ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకి గెస్ట్ గా వచ్చి జగన్ పై నోరు పారేసుకున్నారు. ఫ్యాక్షనిజంతో రుబాబు చేస్తానంటే కుదరదని, వారికి ఏనాడు ఎవరికి దానాలు చేసిన చరిత్ర లేదని, తాము తమ కష్టార్జితాన్ని ఎంతోమందికి దానంగా, సాయంగా అందించానని పవన్ చెప్పుకున్నారు. పైగా ఇండస్ట్రీ మీద కాదు  ఏపీలో దురవస్థలో ఉన్న రోడ్లను ముందు పట్టించుకోవాలంటూ ఎద్దేవా చేశారు. భారీ బడ్జెట్ సినిమాలపై జగన్ నిర్ణయాన్ని తన పై కక్షతీర్చుకోడానికి  తీసుకున్న నిర్ణయంగా చెప్పుకున్నారు. ఆరోజు జగన్ పై  చెలరేగిపోయి మాట్లాడారు. హీరోల రెమ్యునరేషన్ అసలు ఇష్యూనే కాదన్నట్లుగా మాట్లాడారు. దానిని ఇండస్ట్రీ వర్గాలపై జగన్ కక్షగానే చిత్రీకరించారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితులు తెలంగాణలో రావడం.. దీనిపై మెగా కాంపౌండ్, అల్లూ ఫ్యామిలీ ఇతర ఇండస్ట్రీ వర్గాలు కలవరపడుతున్న వేళ కూడా పవన్ తన వైఖరిని వెల్లడించకపోవడంలో అంతరార్ధం ఏంటో అర్ధంకాక ఇండస్ట్రీ వ్గాలు ఆందోళన చెందుతున్నాయి.

ఇంత మౌనమేలనోయి?

ఈమధ్య ఓ మూడు నెలలక్రితం లడ్డూ కల్తీ వివాదం రేగినప్పుడు తమిళ స్టార్ కార్తీక్ కి డైరక్ట్ వార్నింగే ఇచ్చారు.. సెన్సిటివ్ ఇష్యూ అని కామెంట్ చేసినందుకు నోటికొచ్చినట్లు ఎవరు కామెంట్ చేసినా ఊరుకోబోమని అన్నారు. మాట్లాడితే పద్ధతిగా మాట్లాడండి.. లేదంటే మౌనంగా కూర్చోండి.. ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేస్తే జనం ఊరుకోరు అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీకే వార్నింగ్ ఇచ్చారు. మరిప్పుడు కుటుంబంలో ఓ కష్టం వచ్చి, ఏకంగా అది ఇండస్ట్రీ మొత్తం మీద ప్రభావం చూపిస్తుంటే ఆయన మౌనం ఎందుకు వీడటం లేదనేది ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలకు మిలియన్ డాలర్ల ప్రశ్న.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com