39.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

తెలంగాణ సీఎంఓలో ప్రక్షాళన షురూ!

తెలంగాణ సెక్రెటేరియట్‌లో ప్రధానంగా.. సీఎంఓలో ప్రక్షాళన మొదలయ్యింది. సీఎం రేవంత్‌ రెడ్డి పేషీలో అధికారులు, ముఖ్య పదవుల్లో ఉన్నవాళ్లందరూ మారిపోతున్నారు. అధికారుల పనితీరు పట్ల, కార్యదర్శుల వ్యవహార శైలి పట్ల సీఎం రేవంత్ రెడ్డి కొన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎంఓను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సీఎంఓలో జాయింట్‌ సెక్రెటరీగా ఉన్న ఓ మహిళా ఐఏఎస్‌ అధికారిని ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఇప్పుడు ఐఎఫ్‌ఎస్‌ అధికారి అయిన మరో కార్యదర్శిని కూడా తప్పించి వేరే పదవి అప్పగించ బోతున్నారు. సీఎం సీపీఆర్‌వోకు కూడా వేరే పోస్టు ఇవ్వబోతున్నారు. ఇక, సీఎంఓలో ఉన్న మరో కార్యదర్శిని కూడా రేపో మాపో బదిలీ చేయవచ్చని చెబుతున్నారు.

పరిపక్వత లేని సీఎంఓ పేషీ? :

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటయినప్పటినుంచీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన శాంత కుమారి రేపు పదవీ విరమణ చేయబోతున్నారు. వాస్తవానికి ఆమె బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాం నుంచి సీఎస్‌గా పనిచేస్తున్నారు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. పలువురిని సీఎం పేషీలోకి తీసుకున్నారు. తనకు సహకరిస్తారనుకున్న వాళ్లు, తనకు సలహాలు ఇస్తారని భావించిన వాళ్లను ఎంపిక చేసి పలువురిని సీఎంఓకు తీసుకొచ్చారు. కానీ, యేడాది గడిచినా పనితీరులో ఆశించినంత పరిపక్వత కనిపించలేదని రేవంత్‌ రెడ్డి ఫీలయ్యారంటున్నారు. అంతేకాదు.. పలు సభల్లో బహిరంగంగానే ఐఏఎస్‌ అధికారుల పనితీరుపై నిర్మోహ మాటంగా తన ఒపీనియన్‌ను చెప్పుకొచ్చారు. దీంతో, అధికారుల నుంచి ఆశించినంత సహకారం ముఖ్యమంత్రికి గానీ, మంత్రులకు గానీ అందడం లేదన్న వాస్తవం బట్టబయలయ్యింది.

అధికారుల పంతాలు, పట్టింపుల ప్రభావం :

అధికారుల పంతాలు, పట్టింపులు కూడా సీఎంఓ పనితీరుపై ప్రభావం చూపిస్తున్నాయని చెబుతున్నారు. తెలంగాణ సీఎం ఆఫీసులో ఇప్పటిదాకా మొత్తం ఆరుగురు సెక్రెటరీలు ఉన్నారు. అందులో ముగ్గురు ఐఏఎస్, ఒకరు ఐపీఎస్, ఒకరు ఐఎఫ్ఎస్, ఒకరు డిఫెన్స్ కేడర్ చెందిన అఫీసర్లు ఉన్నారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ హోదాలో ఇద్దరు, సెక్రెటరీ హోదాలో ఇద్దరు, స్పెషల్ సెక్రటరీ, జాయింట్ సెక్రెటరీ హోదాలో ఒక్కొక్కరు పనిచేస్తున్నారు. అయితే, మెజార్టీ డిపార్ట్ మెంట్స్ బాధ్యతలు చూస్తున్న సెక్రెటరీలు సర్వీసులో జూనియర్లుగా చెబుతున్నారు. దీంతో శాఖల వారీగా సమాచారం ఇచ్చే విషయంలో.. ఫైల్స్ క్లియరెన్స్ వ్యవహారాల్లో డిపార్ట్‌మెంట్ సెక్రెటరీలు, సీఎం సెక్రెటరీల మధ్య జూనియర్, సీనియర్ అనే పంతాలు, పట్టింపులు తలెత్తుతున్నట్లు9 తెలుస్తోంది. తన కంటే జూనియర్ ఆఫీసర్ అడిగితే ఎందుకు ఆన్సర్ చేయాలనే తీరుతో డిపార్ట్‌మంట్లలో ఉన్న సీనియర్ ఐఏఎస్‌లు వ్యవహరిస్తున్నారన్న వాదనలున్నాయి. అలాగే సీఎంఓలో ఉన్న సెక్రెటరీలు తాము సీఎం ఆఫీసులో పనిచేస్తున్నామని, అడిగిన సమాచారం ఇవ్వాల్సిందేనని ఫోన్‌లో గర్వంగా ప్రవర్తిస్తున్నట్లు విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాలు సీఎం, ప్రభుత్వం పనితీరుపైనా ప్రభావం చూపించాయని, ముఖ్యమంత్రి అసహనానికి కారణమయ్యాయని చెబుతున్నారు.

బిజినెస్‌ రూల్స్‌ తెలియని సెక్రెటరీలు? :

అంతేకాకుండా.. సీఎంఓలో ఉన్న అధికారుల్లో కొందరికి సెక్రెటేరియట్ బిజినెస్ రూల్స్ తెలియక కొత్త సమస్యలు సృష్టిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. సీఎం ఆఫీసులో పనిచేసే సెక్రెటరీలు అటు ముఖ్యమంత్రి, ఇటు సంబంధిత విభాగాలకు మధ్య సంధాన కర్తలుగా ఉండాలి. సీఎం అడిగిన సమాచారాన్ని ఆయా శాఖల బాధ్యతలు చూస్తున్న సెక్రెటరీల నుంచి తెప్పించుకోవాలి. డిపార్ట్‌మెంట్ సెక్రెటరీలకు విధానపరమైన నిర్ణయాలను అమలుచేసే సమయంలో ఏమైనా అనుమానాలు ఉంటే సీఎం దగ్గర సమాచారం తీసుకుని నివృత్తి చేయాలి. కానీ, ప్రస్తుతం సీఎంఓలో పనిచేస్తున్న సెక్రెటరీలు, శాఖలు చూస్తున్న సెక్రెటరీల మధ్య సమన్వయం కొరవడిందన్న చర్చ ఎప్పటినుంచో ఉంది. దీంతో ఫీల్డ్‌లో ఇబ్బందులు రావడం కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారిన సందర్భాలున్నాయి. దీనికి ప్రధాన కారణం అడ్మినిస్ట్రేషన్‌లో పెద్దగా అనుభవం లేని ఆఫీసర్లను సెక్రెటరీలుగా నియమించడమే కారణమని కొందరు ఆరోపిస్తున్నారు. సెక్రెటరీలు తమ అనుభవలేమితో కొన్నిసార్లు ఒకశాఖకు చెందిన ఫైల్‌ను మరో శాఖ అధికారులకు పంపుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

ఈ పరిణామాలకు అనుభవ లేమి ప్రధాన కారణంగా చెబుతున్నారు. సెక్రెటేరియట్ బిజినెస్ రూల్స్ తెలియక కొందరు డిపార్ట్‌మెంట్ సెక్రెటరీలతో పేచీలు పెట్టుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంలో ఏదైనా ఫైల్‌పై సీఎం రేవంత్‌దే తుదినిర్ణయం. ఆయన వద్దకు వచ్చిన ఫైల్‌‌ను ఆమోదించడం లేక తిరస్కరించడం, కుదరకపోతే పెండింగ్‌లో ఉంచడం ముఖ్యమంత్రి ఇష్టం. కానీ, సీఎం ఆమోదానికి పంపే ఫైల్స్‌ను సెక్రెటరీలు పలు కొర్రీలు పెడుతూ వెనక్కి పంపుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

సీఎంఓ కో-ఆర్డినేషన్‌ ఎలా?

సీఎంఓలో ముఖ్యమంత్రినిపేషీని సమన్వయం చేసే అధికారి గానీ, సీఎం ప్రతినిధి గానీ తప్పనిసరి. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి అవసరాలు, ప్రయారిటీలు, ప్రభుత్వ పాలసీల రూపకల్పనకు సంబంధించిన ఐడియాలపై చర్చించేందుకు సీఎంను, పేషీని సమన్వయం చేయడం అతిముఖ్యమైన బాధ్యత. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇది కొరవడిందంటున్నారు. వాటిని పర్యవేక్షిస్తున్నదెవరో తెలియడం లేదు. రేవంత్‌ రెడ్డి కూడా ఆ దిశగా అవసరమైన కసరత్తు చేయలేదంటున్నారు. ఉన్నవాళ్లకు అనుభవం లేదు, వాళ్లకు అవసరమైన మార్గదర్శనం చేసేవాళ్లు లేరు. ఓ రకంగా తెలంగాణ సీఎంఓలో టీమ్‌ కో ఆర్డినేటర్‌ లేరు. ఈ పరిస్థితులు కూడా సీఎం పేషీలో సమన్వయం కొరవడటానికి, ముఖ్యమంత్రి అసహనానికి కారణమంటున్నారు.

పేషీ మొత్తం ప్రక్షాళన? :

ఈ క్రమంలోనే సీఎంఓ ప్రక్షాళనకు సీఎం నడుం బిగించారని చెబుతున్నారు. ప్రధానంగా సీఎం పేషీలో సెక్రెటరీగా పనిచేస్తున్న ఐఎఫ్‌ఎస్‌ అధికారి చంద్రశేఖర్‌ రెడ్డిని ఆర్‌టీఐ ప్రధాన కమిషనర్‌గా నియమించేందుకు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. అదే జరిగితే చంద్రశేఖర్ రెడ్డ స్థానం ఖాళీ అవుతుంది. ఇక, ఇప్పటికే సీఎంఓలో జాయింట్ సెక్రెటరీ హోదాలో పనిచేసిన సంగీత సత్యనారాయణ అనే ఐఏఎస్‌ అధికారిణిని వైద్య, ఆరోగ్య శాఖకు బదిలీ చేశారు. మరోవైపు.. సీఎం సీపీఆర్‌వోగా పని చేస్తున్న బోరెడ్డి అయోధ్య రెడ్డిని కూడా ఆర్‌టీఐ కమిషనర్‌గా పంపించి ఆస్థానం ఖాళీ చేసేందుకు సీఎం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. మరోవైపు.. సీఎంఓలో కార్యదర్శి స్థాయిలో పనిచేస్తున్న ఐపీఎస్‌ అధికారి షానవాజ్‌ ఖాసింను కూడా త్వరలోనే బదిలీ చేస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక, ఇప్పుడు తాజాగా చేసిన బదిలీల్లో సీఎస్‌ స్థానంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును కొత్త సీఎస్‌గా నియమించారు. ఆల్‌రెడీ ఉత్తర్వులు కూడా జారీచేశారు. దీంతో పాటు.. సీఎంఓలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేకంగా పరిశ్రమల పెట్టుబడుల సెల్‌ను ఏర్పాటు చేసి.. జయేశ్‌ రంజన్‌ను సీఈవోగా నియమించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com