పార్లమెంట్ సమావేశాల్లో ఇప్పటికే అంబేద్కర్ పంచాయితీ నడుస్తోంది. రాజ్యాంగ నిర్మాత అయిన బాబా సాహేబ్ అంబేద్కర్‌ను కేంద్రహోంమంత్రి అమిత్ షా అవమానించారంటూ ఇండి కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. అయితే తాను అలా అనలేదని.. తన మాటలకు పెడార్ధాలు తీస్తున్నారంటూ అమిత్ షా చెబుతున్నారు. అయితే ఇదే అంశంపై గురువారం పార్లమెంట్ వద్ద పోటాపోటి నిరసనలకు దిగారు ఎన్డీ, ఇండి కూటమి ఎంపీలు. అయితే ఈ నిరసనల్లోనే కాస్త లైన్ దాటారు ఎంపీలు.
ఈ నిరసనల సమయంలో పరస్పరం తోసుకున్నారు ఇరు కూటముల ఎంపీలు. అయితే ఈ తోపులాటలో బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి గాయపడ్డారు. ఆయన తలకు స్వల్ప గాయం కూడా అయ్యింది. దీంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తనను రాహుల్ గాంధే తోసేశారంటూ సారంగి మీడియాకు చెప్పారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఆయన కాలు జారి పడ్డారని తెలిపారు. అయితే సారింగి వద్దకు వచ్చిన విపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం ముందుగా బీజేపీ ఎంపీలే తనను తోసివేశారని తెలిపారు. అంటే ఆ తర్వాత ఆయనే తోసేశారని అర్థం వచ్చేలా మాట్లాడారు. దీంతో ఇష్యూ కాస్త డైవర్ట్ అయ్యింది. అంబేద్కర్ విషయం కాసేపు పక్కకు పోయి రాహుల్ అంశం తెరపైకి వచ్చింది.
కానీ ఇంతలో ప్రియాంకగాంధీ ఓ కొత్త ఆరోపణను తెరపైకి తీసుకొచ్చారు. బీజేపీ ఎంపీ నెట్టేయడం వల్ల తమ పార్టీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే మోకాలికి గాయమైందని. మరి ఇప్పుడు ఏం చెబుతారు? అంటూ రివర్స్ అటాక్ మొదలైంది కాంగ్రెస్ నుంచి. ఆ తర్వాత ఖర్గే కూడా దీనిపై స్పందించారు. బీజేపీ ఎంపీలు మకర ద్వారం వద్ద తనపై భౌతిక దాడి చేసినట్లు ఆరోపించారు. ఆ సమయంలో తన మోకాళ్లకు గాయమైందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని ఆయన స్పీకర్‌ను కోరారు.
కానీ బీజేపీ ఎంపీ గాయపడటం ఏకంగా హాస్పిటల్‌కు చేరడం.. దానికి రాహుల్ గాంధీపై ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ కొత్త వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చిందంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాళ్లే దాడులు చేసి.. తిరిగి తమపై ఫిర్యాదులు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎవరి వాదనలు వాళ్లే వినిపిస్తున్నారు. కానీ దేశాభివృద్ధికి సంబంధించిన అత్యుత్తమ చర్చలు చేయాల్సిన పార్లమెంట్.. ఎంపీల తీరుతో దాని విలువను కోల్పోతుందా? అనే అనుమానాలు వస్తున్నాయి.