- దాడులు చేసుకున్న మోహన్ బాబు, మనోజ్
- డైల్ 100 ద్వారా పరస్పరం ఫిర్యాదులు
ప్రముఖ సినీనటుడు మంచు మోహన్ బాబు కుటుంబం ఆస్తుల కోసం తగదాలు పడి ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. గత కొంత కాలంగా మోహన్ బాబు కుటుంబంలో కుమారుల మధ్య మనస్పర్ధలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కుమారులిద్దరి మధ్య మాటలు లేవని ఆస్తుల కోసం ఇరువురు కొట్లాడుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్. దీన్ని నిజం చేస్తూ ఆదివారం మోహన్ బాబు ఆయన చిన్నకుమారుడు మంచు మనోజ్ లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపైన తన తండ్రి మోహన్ బాబు దాడి చేసి గాయపరిచినట్లు మంచు మనోజ్ ఫిర్యాదు చేయగా తనపైన తన భార్యపైన చిన్నకుమారుడు మనోజ్ దాడి చేశాడని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. స్కూలు ఆస్తుల పంపకం వ్యవహారంలో చాలా రోజుల నుంచి మోహన్ బాబు కుటుంబంలో మనస్పర్ధలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దాడులు జరిగినట్లు తొలుత డైల్ 100కు ఫోన్ చేసి మోహన్ బాబు, మనోజ్ లు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. అయితే తనకు తగిలిన గాయాలతో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి మంచు మనోజ్ తన తండ్రి మోహనబాబు తనను కొట్టాడని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వెళ్ళి దర్యాప్తు చేస్తున్నారు.