– ముందు భారీ బడ్జెట్, తర్వాత ధరల పెంపు
– హైప్ క్రియేషన్ కోసమే తాపత్రయమా?
– ఏం జరిగినా పట్టింపు అవసరం లేదా?
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్ లోని సంధ్య థియేటర్ దగ్గర పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సమయంలో జరిగిన దుర్ఘటనపై రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పరిణామం తనను కలచివేసిందని పేర్కొన్నారు. అసలు సినిమాలు తీసిన హీరోలు.. రద్దీ ఉంటుందని తెలిసి కూడా అలాంటి సమయంలో సినిమా చూసేందుకు వెళ్లడం కరెక్టేనా? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తెగేసి చెప్పారు. జరిగిన సంఘటనపై చట్ట ప్రకారం అన్నిరకాల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో రేవతి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. పోయిన మనిషి ప్రాణం తీసుకొస్తారా? ఆ కుటుంబానికి తల్లి లేని లోటు తీర్చుతారా? అని ప్రశ్నించారు. రెండు రోజులు గడిచినా సినిమా హీరోగానీ, సినిమా యూనిట్ గానీ.. ఆ సంఘటనలో చనిపోయిన అభిమాని అంశంపై ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు. సినిమాతో వేల కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయని ప్రకటించుకుంటున్నారు కదా.. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత సినిమా హీరో, సినిమా నిర్మాణ సంస్థకు కచ్చితంగా ఉందన్నారు. ఇప్పటికైనా సినిమా టీమ్ స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మంత్రి కోమటిరెడ్డి చిత్ర యూనిట్‌కు సూచించారు.
భారీ బడ్జెట్ సినిమాలు వచ్చిన ప్రతిసారీ….
పెద్దహీరోలు, భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్న ప్రతిసారీ గందరగోళం నెలకొంటోంది. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల పేరిట సినిమా యూనిట్లు ప్రభుత్వాల నుంచి పర్మిషన్లు తీసుకుంటున్నాయి. ఒకరోజు ముందునుంచే షోల మీద షోలు నడిపిస్తూ వేల కోట్ల రూపాయలు వసూళ్లు చూపించుకుంటున్నాయి. ఇలాంటి షోల కోసం ముందునుంచే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాయి. ఫ్యాన్స్, సినిమా ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా తొలిషోలో సినిమా చూడాలని, లేదంటే తొలిరోజే సినిమా చూడాలని, తెల్లవారకముందే సినిమా చూసినట్లు సోషల్ మీడియాలో స్టేటస్‌లు పెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతున్న వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆయా సినిమాల హీరోల అభిమానులే కాదు.. సోషల్ మీడియాను కాస్త ఎక్కువగా వాడుకుంటున్నవాళ్లు కూడా ఇలాంటి వెర్రి వేషాల కోసం తొలకరి షోల కోసం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
సామాన్యుల పరిస్థితి ఏంటి? పోలీసుల బాధలు పట్టేదెవరికి?
దీంతో సినిమా థియేటర్ల దగ్గర రద్దీ పెరిగిపోతోంది. సినిమా హాళ్ల పరిసరాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, రోడ్లు కూడా జనంతో నిండిపోతున్నాయి. సామాన్య జనాలకు, తమ అవసరాల కోసం ఆ పరిసరాల దారుల గుండా ప్రయాణిస్తున్న వాళ్లకు, హాస్పిటల్ ఎమర్జెన్సీ కోసం వెళ్తున్న వాళ్లకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇక, బెనిఫిట్‌షోలు, ప్రీమియర్ షోలు వస్తున్నాయంటేనే పోలీసులకు అదనపు పని ఒత్తిడి అనివార్యమవుతోంది. రద్దీని కట్టడిచేయడం, తొక్కిసలాటలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవడం, ప్రాణనష్టం జరక్కుండా.. వచ్చిన వాళ్లు గాయాల పాలు కాకుండా చూసుకోవడం పోలీసులకు కూడా తలనొప్పిగా మారుతోంది. అయినా ప్రభుత్వాలు ప్రతిసారీ బెనిఫిట్ షోలకు అనుమతులు ఇస్తున్నారు. బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వడం తోనే సరిపెట్టడం లేదు. ఏకంగా టికెట్ల ధరలను 50శాతం, 100 శాతం పెంచుకునేందుకు కూడా ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చేస్తున్నాయి. దీంతో, ఆయా సినిమాల యూనిట్లు వేల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తున్నాయి. ఎలాగూ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలతోనే ఆ పెట్టుబడులు రాబట్టుకోవచ్చన్న ఆలోచనలో ఉన్నాయి.
సినిమాటోగ్రఫీ మంత్రి ప్రకటనతో హాట్ డిస్కషన్ :
అయితే, ఇప్పుడు సాక్షాత్తూ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కన్నెర్ర జేయడం చర్చను లేవనెత్తింది. అంతేకాదు.. ఇకపై బెనిఫిట్‌షోలకు అనుమతి ఇవ్వబోమని కూడా కరాఖండిగా మంత్రి చెప్పేశారు. అయితే, బెనిఫిట్ షోలే కాదు.. సినిమా టికెట్ల పెంపుపైనా ఇలాగే కఠినంగా ఉంటారా? అన్న ఆలోచనలు కూడా ముంచెత్తుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సినిమా ప్రియులు, ఆయా హీరోల ఫ్యాన్స్‌ను పక్కన బెడితే.. సామాన్యులు, న్యూట్రల్ పర్సన్స్, సామాజిక వేత్తలు కూడా ఈ అంశంపై చర్చ జరగాలని కోరుకుంటున్నారు. అంత భారీ బడ్జెట్ పెట్టి, డబ్బులను మంచి నీళ్లలా ఖర్చుచేసి.. తర్వాత బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, ఎక్స్‌ట్రా చార్జీలంటూ ప్రభుత్వాల ముందు మోకరిల్లడం దేనికన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.