పహల్గామ్ లో తిరంగ్ జెండాను ఎగరవేసిన జనసేన శాసనసభ్యుడు
కాశ్మీర్ భూతల స్వర్గం… జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాని నరేంద్రమోడీతో సారధ్యంలోని భారత ప్రభుత్వ సరైన సమాధానం ఇచ్చిందని జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. పహల్గామ్ లో సాధారణ పరిస్ధితులు నెలకొన్నాయని, పర్యటకానికి వంద శాతం అనువైన ప్రాంతం అని చాటి చెప్పడానికి పంతం నానాజీ ఉగ్రదాడి జరిగిన పహల్గాం సందర్శించి అక్కడ జాతీయ జెండా ఎగుర వేశారు. భారత రక్షణ సంపత్తికి తోడు దైవ బలం కూడా ఉండాలనే ఉద్దేశంతో మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఆరుగురు శాసనసభ్యులను తమిళనాడులో షష్ట షణ్ముఖ దేవాలయాలకు పంపిచారని ఆయన తెలిపారు. దేవగణ సైన్యాధ్యక్షుడైన సుబ్రహ్మణ్యస్వామి ఆశీర్వాదాలు తీసుకుందామని పళని వెళ్లినప్పుడు అక్కడ మహావతార్ బాబా గురుదేవుల సమాధి వద్ద పహల్గాం వెళ్ళాలనే సంకల్పం కలిగిందని పంతం నానాజీ చెప్పారు. గడచిన రెండు సంవత్సరాలుగా కాశ్మీర్ లోయలో టూరిజం బాగా అభివృద్ధి చెందుతోందన్న అక్కసుతోనే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ దాడులు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మన రక్షణ దళాలు పాకిస్తాన్ కు ఉగ్రవాదులకు కలిపి గట్టి జవాబు ఇచ్చారని జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ కొనియాడారు.