జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ప్లీనరీ నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈమేరకు పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో జనసేన పార్టీ శ్రేణుల్లో జోష్ మొదలయ్యింది. ప్లీనరీ ఎప్పుడెప్పుడా అని అప్పుడే సందడి చేస్తున్నారు.
మార్చి 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మూడు రోజుల పాటు జనసేన ప్లీనరీ నిర్వహించనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీ జరగనుంది. అయితే, ప్లీనరీ ఏర్పాట్లు, విధివిధానాలు, పార్టీ శ్రేణులకు అప్పగించాల్సిన బాధ్యతలపై ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. విజయవాడలోని పార్టీ ఆఫీసులో ప్లీనరీ కోర్‌కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలువురు ముఖ్యులతో ప్లీనరీ ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్రంలోని ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామ్య పార్టీగా ఉన్నందున ప్లీనరీని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన నాదెండ్ల మనోహర్ పార్టీ నేతలకు సూచించారు.