సౌత్ సెంట్రల్ రైల్వే ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పలు ప్లాట్‌ఫామ్‌లు తాత్కాలికంగా మూసేశారు. రైల్వేస్టేషన్ ఆధునీకరణలో భాగంగా కొద్దిరోజులుగా పాత నిర్మాణాలన్నీ కూల్చివేసి.. పునర్నిర్మిస్తున్నారు. ఈ పనుల్లో భాగంగా.. రైల్వేస్టేషన్ మొత్తం రూపురేఖలను మార్చేస్తున్నారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోని నిర్మాణాలన్నీ ఆధునీకరిస్తున్నారు.
ఈ ఆధునీకరణలో భాగంగానే.. సికింద్రాబాద్ స్టేషన్‌లోని 5వ, 6వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌లను మూసేశారు. ఈ ప్లాట్‌ఫామ్‌లకు వెళ్లే మెట్లు, లిఫ్ట్, ఎస్కలేటర్లు కూడా మూసేశారు. మంగళవారం వీటిని మూసేయగా.. 13 రోజుల పాటు ఆ ప్లాట్‌ఫామ్‌లపైకి ఎవరూ వెళ్లకుండా మూసేశామని అధికారులు ప్రకటించారు. ఈ రెండు ప్లాట్‌ఫామ్‌ల ఆధునీకరణ పూర్తయిన తర్వాత.. వీటిని ఓపెన్ చేసి.. మరో రెండు ప్లాట్‌ఫామ్‌లను మూసేసి.. ఆధునీకరణ పనులు చేపడతామని వెల్లడించారు. ఇలా.. దశల వారీగా స్టేషన్‌లోని పది ప్లాట్‌ఫామ్‌లనూ ఆధునీకరిస్తామన్నారు. ఆ తర్వాత ట్రెయిన్స్‌ను యథావిధిగా నడిపిస్తామని వివరించారు. ఈ ఆధునీకరణ పనులు జరిగినంత కాలం.. చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్‌లకు పలు రైళ్లు దారి మళ్లిస్తున్నామన్నారు. జూలై వరకు అన్ని ప్లాట్‌ఫామ్‌ల ఆధునీకరణ పనులు పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. అలాగే, రైల్వేస్టేషన్ రీ డిజైన్ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.