29.7 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

దించితే దింపారు.. నా దగ్గరెందుకు? – భయపడుతోన్న పంజాబ్‌ సీఎం

విమానాలు దించితే దింపుతున్నారు.. కానీ, మా రాష్ట్రంలో ఎందుకు దింపుతున్నారు? ఇదీ.. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ప్రశ్న. దీని వెనుక కుట్ర కూడా ఉందంటున్నారు. రాజకీయంగా బ్లేమ్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు పంజాబ్‌ సీఎం. అమెరికా విమానాల డెస్టినేషన్‌గా పంజాబ్‌ను కేంద్రం ఎంచుకోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక కేంద్రం ఉద్దేశం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదంగా ముదురుతోంది.

అక్రమంగా అమెరికా వెళ్లిన భారతీయులను గుర్తించిన అక్కడి ప్రభుత్వం వారిని తిరిగి స్వదేశానికి పంపిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే 104 మందితో ఓ విమానం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ల్యాండ్‌ అయ్యింది. సుమారు 200 మంది భారతీయులతో మరో రెండు విమానాలు ఈనెల 15, 16 తేదీల్లో అమృత్‌సర్ చేరుకోనున్నాయి. వీటిలో 119 మందితో ఇవాళ రాత్రి మరో విమానం అమృత్‌సర్‌కు రానుంది. రేపు కూడా మరో విమానం అమృత్‌సర్‌కే రానుందని అధికారిక సమాచారం వచ్చింది. ఈ అంశంపై పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ ఇష్యూ కావడంతో.. రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేందుకే మోదీ ప్రభుత్వం ఇలా చేస్తోందని మండి పడుతోంది.

అమెరికాకు సరైన మార్గంలో కాకుండా.. అక్రమంగా వెళ్లిన భారతీయులతో వస్తున్న యూఎస్ విమానాల డీపోర్టింగ్‌ స్పాట్‌గా పంజాబ్‌ను ఎంచుకోవడంపై రాజకీయ వివాదం మొదలైంది. అక్రమ వలసదారులతో తిరిగి వస్తున్న అమెరికా విమానాలను పంజాబ్‌లో ల్యాండ్‌ చేయడం వెనుక కేంద్రం దురుద్దేశ్యం ఉందని పంజాబ్‌ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ చీమా ఆరోపించారు. హర్యానాలోనో, గుజరాత్‌లోనే ఆ విమానాలను ఎందుకు దించకూడదు? పంజాబ్‌ను టార్గెట్ చేసినట్టు స్పష్టంగా అర్థమవుతోందని, పంజాబ్‌కు బదులు అహ్మదాబాద్‌లో ఆ విమానాలను ల్యాండ్ చేయాలని చీమా డిమాండ్ చేశారు. ఇక, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రగత్ సింగ్ సైతం ఇదే తరహా ఆరోపణలు చేశారు. రిపీట్‌గా పంజాబ్‌లోనే విమానాలు దిగుతుండటం దురదృష్టకరమన్నారు.

డిపోర్టేషన్‌‌లో భాగంగా ఫిబ్రవరి 5వ తేదీన 104 మంది భారతీయులతో అమెరికా ఆర్మీ విమానం అమృత్‌సర్‌లో ల్యాండ్‌ అయ్యింది. మరో 119 మందితో ఇవాళ వచ్చే విమానం అమృత్‌సర్‌లోనే దిగనుంది. అలాగే, మరో విమానం కూడా రేపు అక్కడే ల్యాండ్‌ అవుతుంది. ఇవాళ వచ్చే 119 అక్రమ వలసదారుల్లో 69 మంది పంజాబ్‌, 33 మంది హరియాణా, ఎనిమిది మంది గుజరాత్‌, యూపీకి చెందిన వారు ముగ్గురు, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌కు చెందినవారు ఇద్దరు చొప్పున, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌కు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

కాగా, పంజాబ్‌ ప్రభుత్వంతో పాటు.. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఆరోపణలపై బీజేపీ పంజాబ్‌ అధ్యక్షుడు సునీల్‌ జాఖడ్‌ స్పందించారు. అమెరికా నుంచి వస్తున్న వాళ్లంతా భారతీయులేనని, అమృత్‌సర్‌లోనే అమెరికా ఆర్మీ విమానాలు దిగడం పెద్ద విషయం కాదన్నారు. దీనిని రాజకీయం చేయడం కంటే.. అక్రమ మార్గాల్లో వెళ్లేందుకు ప్రజలు ఎందుకు ప్రయత్నిస్తున్నారో, వాటిని నివారించేందుకు ఏం చేయాలో సమస్య పరిష్కారం గురించి ఆలోచించాలన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com