- నాయకుడిగా విఫలం అయిన ప్రశాంత్ కిషోర్
- గెలుపు గుర్రాలకిచ్చే వ్యూహాలా సెక్సెస్ అవుతాయా…?
- బీహార్ ఉప ఎన్నికల్లో జన సురాజ్ పార్టీకి ఘోర పరాజయం
- పీకే పార్టీ పోటీ చేసిన నాలుగు స్ధానాల్లో మూడింటిలో డిపాజిట్లు గల్లంతు
మాటలు చెప్పటం తేలికే చేసి చూపించు అనటం అనేక సందర్భాల్లో మనకు అనుభవమే. ఈ మాటే ఇప్పుడు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విషయంలో సరిగ్గా సరితూగుతుంది. దాదాపు దశాబ్ద కాలానికి పైగా దేశంలోని పలు రాజకీయ పార్టీలకు, నేతలకు వ్యూహాలు అమ్మి… తాను ఇచ్చిన వ్యూహాల వల్లే సదరు నేతలు అధికారంలోకి వచ్చారు అని చెప్పుకున్న పీకే…తన విషయం వచ్చే సరికి బొక్క బోర్లాపడ్డాడు. బీహార్ రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ స్థానాలు – బేలాగంజ్, ఇమామ్ గంజ్, తరారీ, రామ్ గర్ కు మహారాష్ట్ర, ఝార్ఘండ్ తో పాటు ఎన్నికలు జరిగాయి. ఈ నాలుగు స్థానాల్లో పీకే తాను ప్రారంభించిన జన్ సురాజ్ పార్టీ తరపున అభ్యర్ధులను నిలబెట్టారు. నాలుగింట మూడు స్థానాల్లో అభ్యర్ధుల డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. కనీసం ఒక్కచోట కూడా రెండో స్థానానికి కూడా రాలేకపోయారు. పీకే పార్టీ కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఇన్నేళ్లు నేనే కింగ్ మేకర్ గా ఉన్నాను…ఇప్పుడు నేనే ఎందుకు కింగ్ కాకూడదు అన్న ఆలోచనతో ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీని ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీన బీహార్ లో ప్రారంభించారు. అయితే అధికారికంగా ప్రకటించనప్పటికీ రెండేళ్లు ముందు నుంచే క్షేత్ర స్థాయిలో పార్టీకి పునాదులు వేసుకుంటూ వచ్చారు. బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా 2022 నుంచి జన సురాజ్ పాదయాత్ర పేరుతో 3వేల 500 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. అంటే రెండేళ్లుగా పాదయాత్ర ద్వారా బీహార్ ప్రజలను కలుస్తూ వచ్చారు. ఎన్నికల వేళ ఈ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పీకే ఏకంగా 125 సభలు నిర్వహించారు. ఇంత చేసినా బీహారీల్లో తన పట్ల నమ్మకాన్ని తెచ్చుకోలేకపోయారు అన్న విషయం తాజా ఫలితాలను బట్టి అర్థం అవుతోంది. లాలూ ప్రసాద్ యాదవ్, నితీశ్ కుమార్ ల పై విమర్శలు ఎక్కుపెడుతూ, నిజాయితీతో రాజకీయాలు చేస్తాను అంటూ ప్రచారం చేశారు పీకే. అయితే వాస్తవంలో మాత్రం తాను నిలబెట్టిన నలుగురు అభ్యర్ధుల్లో ముగ్గురు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారే కావటం విమర్శలకు దారి తీసింది.
గట్టు మీద కూర్చుని మాటలు ఎన్నైనా చెప్పవచ్చు. దిగిన వాళ్లకే లోతు తెలుస్తుంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కు కూడా ఇది అనుభవంలోకి వచ్చి ఉంటుంది. కోట్లాది రూపాయల ఫీజు తీసుకుని రాజకీయ నాయకులకు వ్యూహాలు అందించిన పీకే తన సొంత పార్టీనే గెలిపించుకోలేక చతికిలబడ్డారు. అలా అని పీకే ప్రతిభను తక్కువ అంచనా వేయలేం. ఒక కోణం నుంచి చూస్తే పీకే పట్టిందల్లా బంగారం. 2014లో నరేంద్ర మోడీ నుంచి మొదలుపెడితే అరవింద్ కేజ్రీవాల్, కెప్టెన్ అమరేందర్ సింగ్, మమతా బెనర్జీ, జగన్ మోహన్ రెడ్డి, స్టాలిన్ ఇలా పలువురి గెలుపులో పీకే పాత్ర ఉంది. అందుకే తన సక్సెస్ స్ట్రైక్ రేటు ఎక్కువని పీకే దేశవ్యాప్తంగా ఒక ఇమేజ్ ను తెచ్చుకోగలిగారు. ఒక దశలో పీకే పక్కన లేకపోతే, ఆయన వ్యూహాలు రచించకపోతే తలపండిన రాజకీయ నాయకులు కూడా గ్రౌండ్ లో ఘోరంగా ఓడిపోవటం ఖాయం అన్న అభిప్రాయాన్ని సృష్టించగలిగారు. కాని నాణాన్ని తిప్పితే అదే పీకే ప్రస్థానం, మనస్తత్వం ఎంత చంచలమైందో అర్థం అవుతుంది. తనను తాను ఎక్కువగా ఊహించుకోవటం వల్లే ఏ రాజకీయ పార్టీతోనూ, ఏ రాజకీయ నేతతోనూ ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. కొనసాగలేకపోయారు అనే కంటే రాజకీయ నాయకులే పీకేతో కాంట్రాక్ట్ వద్దనుకున్నారు అనటం కరెక్ట్ అవుతుంది.
2014లో నరేంద్ర మోడీ సోషల్ మీడియా క్యాంపైన్లను విజయవంతంగా ముందకు తీసుకుని వెళ్లిన పీకేతో ఆ తర్వాత కొద్ది కాలానికే బీజేపీ తెగతెంపులు చేసుకుంది. 2015లో సొంత రాష్ట్రం బీహార్ లో జనదళ్ (యు) నితీశ్ తో కన్సల్టెన్సీ కాంట్రాక్ట్ సంపాదించారు. ఆ ఎన్నికల్లో నితీష్ గెలుపు కోసం కృషి చేశారు. పక్కా ప్రొఫెషనల్ కన్సల్టెంట్ అయిన ప్రశాంత్ కిషోర్ అటు కాంగ్రెస్ శిబిరంలోకి వెళ్లటానికి ప్రయత్నాలు చేశారు. 2017లో పంజాబ్, ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ వ్యూహకర్తగా ఒప్పందం చేసుకున్నారు. పంజాబ్ లో గెలిచినా కీలకమైన యూపీలో పీకే వ్యూహాలు ఏ మాత్రం పని చేయలేదు. కాంగ్రెస్ ఘోరంగా ఓటమి పాలయ్యింది. పంజాబ్ లో సీఎమ్ అయిన కెప్టెన్ అమరీందర్ సింగ్ పీకేను తన ప్రభుత్వానికి ప్రముఖ సలహాదారుగా నియమించారు. ఐదు నెలల్లోనే ఆ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు పీకే. మరోవైపు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ప్రయత్నాన్ని 2018 లో జేడీయూతో మొదలు పెట్టారు. ఆ పార్టీ అధ్యక్షుడు నితీశ్ కుమార్ పీకేను ఉపాధ్యక్షుడిగా నియమించారు. కొంత కాలానికే నితీశ్ కుమార్ పై బహిరంగ విమర్శలు చేయటం మొదలు పెట్టారు పీకే. దీనితో ఏడాదిన్నర కాలంలోనే పార్టీ నుంచి పీకేను బహిష్కరించారు నితీశ్ కుమార్. ఒక దశలో కాంగ్రెస్ పార్టీలో చేరటానికి పీకే ఉత్సాహం చూపించినా రాహుల్ గాంధీ పీకే డిమాండ్లను అంగీకరించలేదు. తెలంగాణాలోనూ పీకేకు ఇదే అనుభవం ఎదురయ్యింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికు ముందు బీఆర్ఎస్ కు వ్యూహాలు అందించేందుకు పీకే ప్రయత్నం చేశారు. పీకే తీరు నచ్చకపోవటంతో కేసీఆర్ పీకేతో ఒప్పందాన్ని అంగీకరించలేదు.
2019 ఎన్నికల్లో వైసీపీకి వ్యూహాలు అందించిన పీకే 2024 ఎన్నికలు వచ్చే సరికి జగన్ కు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేసి చర్చనీయాంశంగా మారారు. గెలిచే అవకాశం బలంగా ఉన్న పార్టీలు, నాయకులనే ఎంచుకుని కన్సల్టెన్సీ కాంట్రాక్ట్ తీసుకుంటారని, తద్వారా వారి గెలుపును తన ఖాతాలో వేసుకుంటారు అన్న విమర్శ పీకే పై ముందు నుంచి ఉంది. పార్టీకి, నాయకుడికి ప్రజల్లో బలం లేకపోతే ఎన్ని వ్యూహాలు పన్నినా ఫలితం ఉండదు అన్న సూత్రాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా పీకే పెట్టిన పార్టీ- జన సురాజ్ పార్టీ ఫలితాలు మరోసారి పునరుద్ఘాటిస్తున్నాయి.