పీజేఆర్(పి.జనార్థన్ రెడ్డి ) అంటే పేరు కాదు.. ఒక బ్రాండ్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. శనివారం పీజేఆర్ 17వ వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్ కూడలి లోని ఆయన విగ్రహానికి ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పూల మాల వేసి.. నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పేదలు, కార్మికులు, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పీజేఆర్ చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘కొంత మంది రాజకీయ నాయకులే ప్రజల గుండెల్లో చిరంజీవిగా ఉంటారు. ఆ జాబితాలో పీజేఆర్ ముందు వరుసలో ఉంటారు.
పేదలు, కార్మికుల పక్షపాతిగా చివరి శ్వాస వరకు వారి కోసమే తపించారు’ అని కొనియాడారు. చివరి వరకు వరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే శ్వాసగా బతికారు. సీఎల్పీ నాయకుడిగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తారు. నా ప్రాంతం… నా ప్రజలే ముఖ్యం అంటూ సొంత పార్టీ సీఎంపైనే ధిక్కార స్వరం వినిపించారు. ఎంతో మందికి రాజకీయాల్లో ఓనమాలు నేర్పించి, పెద్ద పెద్ద నాయకులుగా తయారు చేశారు’ అని గుర్తు చేసుకున్నారు. పీజేఆర్ స్ఫూర్తితోనే ‘ప్రజా ప్రభుత్వం’ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లోని పేదలు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమం లో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.