పిఠాపురం తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టచ్‌లోకి వెళ్తున్నారా? ఈ అంశం గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జనసేన నేత, ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి ఇదే విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్మ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో టచ్‌లోకి వెళ్లి పవన్ కళ్యాణ్‌పై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. వర్మకు ఏమైనా సమస్యలు ఉంటే, వాటిని తన సొంత పార్టీ తెలుగుదేశం హైకమాండ్‌తో పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు.
గత ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ తన సీటును త్యాగం చేశారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పోటీ నుంచి తప్పుకుంటూ, జనసేన విజయానికి అహర్నిశలు కృషి చేశారు. అప్పట్లో వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్సీ పదవుల భర్తీలో వర్మకు అవకాశం దక్కలేదు. ఈ పరిణామం వర్మలో అసంతృప్తిని పెంచింది.
ఈ క్రమంలోనే జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. పవన్ కళ్యాణ్ విజయానికి వర్మ ఎలాంటి పాత్ర పోషించలేదని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఈ ఘటన తర్వాత జనసేన, వర్మ మధ్య దూరం మరింత పెరిగింది. పవన్ కళ్యాణ్ వర్మకు ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుకున్నారని వర్మ అనుచరుల్లో విమర్శలు వినిపించాయి.
ఇదే సమయంలో వర్మ పిఠాపురం నియోజకవర్గంలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ప్రజలతో మమేకం అవుతూ, జనసేనకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ పర్యటనలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ముద్రగడ కుమార్తె క్రాంతి సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. వర్మకు ఎమ్మెల్సీ పదవి రాకపోవడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యత లేదన్నారు. ఇది టిడిపి అంతర్గత వ్యవహారం అని స్పష్టంగా తెలిపారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు వర్మ పాల్పడుతున్నారని, ఆయన వ్యాఖ్యలతో కూటమి పార్టీల మధ్య విభేదాలు రేకెత్తుతున్నాయని విమర్శించారు.
క్రాంతి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఆరోపణలతో పిఠాపురం రాజకీయాలు మరింత వేడెక్కాయి. వర్మ నిజంగానే వైయస్ఆర్ కాంగ్రెస్ టచ్‌లో ఉన్నారా? లేక ఇవన్నీ పుకార్లా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.