తెలంగాణ ప్రభుత్వం ఇటీవల బెట్టింగ్ యాప్ కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక విచారణ బృందం – సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సిట్‌కు సీఐడి డీజీ రమేష్‌ను చీఫ్‌గా నియమించారు. మొత్తం ఐదుగురు పోలీస్ అధికారులతో ఈ బృందం రూపుదిద్దుకుంది. సీనియర్ ఐపీఎస్ అధికారులు ఐజీ రమేష్ రెడ్డి, ఎస్పీలు సింధు శర్మ, వెంకట లక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్ సభ్యులుగా ఉన్నారు. 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని తెలంగాణ డీజీపీ జితేందర్ సిట్‌కు ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఉత్తర్వుల మేరకు ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులను సిట్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్‌లపై చర్యలు తీసుకోవాల్సిన విధానాలను సిఫారసు చేయడమే కాకుండా, పేమెంట్ల వ్యవహారాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సూచనలు ఇవ్వనుంది.
బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి ఒక్క హైదరాబాద్‌లోనే పంజాగుట్ట, సైబరాబాద్, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో మొత్తం 25 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. ఇతర స్టేషన్లలో కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై కేసులు నమోదయ్యాయి. యాంకర్లు విష్ణుప్రియ, శ్యామల సహా పలువురు ఇన్‌ఫ్లూయెన్సర్లు విచారణకు హాజరై పోలీసుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. బెట్టింగ్ యాప్ వ్యవహారంలో తమపై నమోదైన కేసులు రద్దు చేయాలని సెలబ్రిటీలు కోర్టులను ఆశ్రయించారు. అయితే న్యాయస్థానాలు ఆ పిటిషన్లను కొట్టివేసాయి.
సినీ నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి సహా 25 మంది సెలబ్రిటీలపై బెట్టింగ్ యాప్ ప్రచార కేసులు నమోదు అయ్యాయి. ఫణీంద్ర శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
మరోవైపు.. టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన ట్వీట్లతో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు స్పందించాయి. పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశాయి. బాధితులు తమకు జరిగిన మోసం, నష్టపోయిన మొత్తం ఎంత అనే విషయాలపై ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సజ్జనార్ బాధితులకు సూచించారు.
మరోవైపు.. ఏపీ ప్రభుత్వం కూడా బెట్టింగ్ యాప్స్‌పై నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురాబోతుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, బెట్టింగ్ యాప్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, సులభ మార్గంలో సంపాదనలో మాయమాటలు నమ్మొద్దని హెచ్చరించారు. నటీనటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు ప్రజలను మోసం చేసే విధంగా ప్రోత్సహించరాదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈజీ మనీ వ్యవహారాలపై గట్టి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈమేరకు ఏకంగా అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.