ఓవైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజా ప్రభుత్వం విజయ పథాన దూసుకెళ్తోంది.
రేవంత్, భట్టి రాష్ట్రానికి రెండు కళ్ళుగా వ్యవహరిస్తూ.. పాలనపై తిరుగులేని ఆదిపత్యాన్ని కొనసాగించడం చూస్తుంటే దివంగత నేత, నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. నాటి పిసిసి అధ్యక్షుడు దివంగత నేత, డీఎస్ ల జోడీ కళ్ళ ముందు కనిపిస్తోంది.
రాష్ట్ర సంపదలోని ప్రతి పైసా పేదవాని ఇంటికి చేరాలన్న లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. తెగువతో నాటి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను నాటి హోంమంత్రి చిదంబరంతో చేయించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది ఏళ్లు అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది.
తెలంగాణ సెంటిమెంట్, మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే అన్న కెసిఆర్ మాటలు నమ్మి రాష్ట్ర ప్రజలు టిఆర్ఎస్ కు అధికారాన్ని కట్టబెట్టారు.
బీఆర్ఎస్ పార్టీ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీ లేకపోగా.. ఆత్మ అభిమానం కోల్పోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ నలుగురు కుటుంబ సభ్యులే పదవులు పొందారు.. రాష్ట్రంలోని బడాబాబులకు మన సంపదను దోచిపెట్టి కెసిఆర్ కుటుంబం లక్షల కోట్లకు ఎగబాకిందని ఎన్నికల్లో విమర్శలు సంధించారు.
ఈ తరుణంలో ఓవైపు పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి భారీ సభలు నిర్వహించుకుంటూ ముందుకు పోతుండగా, మరోవైపు సీఎల్పీ నేతగా కీలక బాధ్యతలో ఉన్న భట్టి విక్రమార్క సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు.
మండుటెండలో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు సబ్బండ వర్గాలను కలిసి వారితో మమేకమై.. మీకు మేము ఉన్నాం.. రాబోయేది ఇందిరమ్మ రాజ్యం అని భరోసా కల్పించారు. ఈ అద్భుత జోడి మాటలు విశ్వసించిన ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం అప్పగించారు.
ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు.
బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రామలక్ష్మణులు, కృష్ణార్జునల మాదిరిగా సమిష్టి నిర్ణయాలు తీసుకుంటూ కొత్త చరిత్రకు తెరలేపుతున్నారు.
బాధ్యతలు చేపట్టిన మొదటి గంటలోనే రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. మీకు మేమున్నాం అంటూ మొదటి సంతకంలోనే పేదల గుండెల్లో భరోసా నింపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్నారు. గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించి లక్షలాది గుండెలను తాకారు.
మిగులు బడ్జెట్తో కెసిఆర్ కు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పగిస్తే 7 లక్షల కోట్ల అప్పుతో ఆయన కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని అప్పగించారు. ఆయన చేసిన అప్పులకే అసలు, వడ్డీ కలిపి ప్రతి సంవత్సరం 64,516 వేల కోట్లు బకాయిల రూపంలో బ్యాంకులకు చెల్లించాల్సి వస్తోంది.
సంక్షేమ పథకాలకు 61,194 వేల కోట్లు సమకూర్చాల్సిన పరిస్థితి. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నప్పటికీ … ఇప్పట్లో ఎన్నికలు లేనప్పటికీ ఇచ్చిన మాట మేరకు అటు సీఎం, ఇటు ఉపముఖ్యమంత్రి
రైతులకు రెండు లక్షల రుణమాఫీ కింద రోజుల వ్యవధిలోనే 21 వేల కోట్ల నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
22,500 కోట్లతో రాష్ట్రంలోని 4.50 లక్షల మంది నిరుపేదలకు మొదటి దశలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని నిర్ణయించారు. చిన్న వర్షానికి హైదరాబాద్ రోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. చెరువులు, నాళాలు కబ్జాకు గురి కావడంతో వాటిని ప్రక్షాళన చేసేందుకు మూసి పునర్జీవం ప్రాజెక్టును ప్రభుత్వం భుజాన వేసుకుంది. మురుగు కంపు కొడుతున్న మూసిని ప్రక్షాళన చేసి మంచినీటిని పారించి, పర్యాటకంగా తీర్చిదిద్ది నగరవాసులకు ఆహ్లాదాన్ని తీసుకొచ్చేందుకు హైడ్రాను ఏర్పాటుచేసి ముందుకు పోతున్న ప్రభుత్వానికి జనం జేజేలు పలుకుతున్నారు. నదీ గర్భంలో నిర్మించిన వారిని తరలిస్తాం, వారికి అన్ని రకాల పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం మరోసారి ఇవ్వడంతో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. మహిళలను మహాలక్ష్మిలుగా చూసుకుంటామని చెప్పడమే కాదు ఆచరణలో చూపిస్తూ ఉండడంతో ప్రతి ఇంట ఇందిరమ్మ ప్రభుత్వం గురించి చర్చ జరుగుతుంది.
ఓవైపు విపక్షాల ఎత్తుగడలను చిత్తు చేస్తూ మరోవైపు ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క జోడికి జనం జేజేలు పలుకుతున్నారు.