ఆర్టీజీఎస్‌పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
సమర్ధవంతమైన పాలన అందించేలా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని, రియల్‌టైమ్‌లో సమాచారాన్ని సేకరించి మిగిలిన శాఖలతో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమాచారాన్ని ఆర్టీజీఎస్ సమీకృతం చేసి, మొత్తంగా పర్యవేక్షించాల్సి ఉంటుందని చెప్పారు. మొదటగా ప్రతిశాఖలో సమాచార సేకరణ జరగాలని, తర్వాత ఆ సమాచారాన్ని సమీకృతం చేసుకోవాలని అంతిమంగా ‘వాట్సప్ గవర్నెన్స్’ ద్వారా అత్యుత్తమ సేవలు అందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. మంగళవారం సచివాలయంలో సీఎంవోతో సహా ఆర్టీజీఎస్‌కు చెందిన అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
కుల ధృవీకరణ దగ్గర నుంచి ఆదాయ ధృవీకరణ పత్రం, ఇతర ధృవపత్రాలను పొందేందుకు వాట్సప్‌ను వేదిక చేసుకునేలా వ్యవస్థను రూపొందించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ఏఐ, డీప్‌టెక్ వంటి టెక్నాలజీ సేవలు వినియోగించుకుని వేగంగా పరిష్కరించాలని సూచించారు. వినతుల పరిష్కార విధానం, ప్రజల సంతృప్తి స్థాయి కూడా ఆర్టీజీఎస్ పరిశీలించాలని అన్నారు. డ్రోన్లు, సీసీ కెమేరాలు, శాటిలైట్లు, ఐవోటీ డివైజ్‌ల ద్వారా సేకరిస్తున్న విజువల్స్‌ను కూడా సమీకృతం చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ధాన్యం సేకరణపై రైతుల్లో ఎక్కడైనా అసంతృప్తి ఉంటే..ఎందుకు వ్యక్తమవుతోందనే దానిని పరిశీలించి తక్షణం ఆ సమస్యను పరిష్కరించాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచార ప్రామాణికతను విశ్లేషించి, అవసరమైతే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఆధార్ సంబంధిత సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన మరో వెయ్యి ఆధార్ కిట్ల కొనుగోలుకు సంబంధించిన రూ.20 కోట్ల నిధుల మంజూరుకు ముఖ్యమంత్రి అనుమతిచ్చారు. వీలైనంగా త్వరగా గ్రామ, వార్డు సచివాలయాల్లో వెయ్యి ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో జనన, మరణ ధృవపత్రాలు పొందేందుకు తలెత్తుతున్న ఇబ్బందులను శాశ్వత పరిష్కారంగా ఏర్పటు చేయనున్న నూతన వెబ్ పోర్టల్‌ను వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.