అంతకంతకు పెరుగుతున్న లోకేష్ డెప్యూటీ సీఎం డిమాండ్..
ఏపీలో సరికొత్త వ్యవహరం కొత్తగా తెర మీదకు వచ్చింది. మంత్రి నారా లోకేష్ ను డెప్యూటీ సీఎంను చేయాలనే డిమాండ్ ముందుగా సోషల్ మీడియాలో మొదలైంది.. ఆ తర్వాత నేతల నోటి నుంచి రావడం ప్రారంభమైంది. ఏకంగా చంద్రబాబు సమక్షంలోనే లోకేష్ బాబును డెప్యూటీ సీఎం చేయాలంటూ కడప జిల్లాకు చెందిన పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి ఏకంగా డిమాండ్ చేయడంతో ఇది పీక్స్ చేరిందనే చెప్పాలి. దీనికి కంటిన్యూగా మరో పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఇదే తరహా డిమాండ్ వినిపించారు. దీంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కూటమి పార్టీల్లో కోల్డ్ వార్ జరుగుతోందని.. పైకి కన్పించినంత సఖ్యత కూటమి పార్టీల మధ్య లేదని.. మరి ముఖ్యంగా కూటమిలో కుంపట్లు రాజుకున్నాయని.. పవన్ కళ్యాణ్ వర్సెస్ లోకేష్ అన్నట్టుగా రాజకీయం ముదిరిందనే చర్చ జోరుగా సాగుతోంది.
కూటమిలో కుంపటి రాజుకుంటుందనే ఆందోళన..
దీంతో కూటమిలో కుంపటి రాజుకుందనే ఆందోళన మొదలైంది. మొన్నటి వరకు జరిగిన పరిణామాలు ఒకలాగా ఉంటే.. గత రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న చర్చ.. మరో విధంగా ఉందని అంటున్నారు. మొన్నటి వరకు జరిగిన పరిణామాలు కావచ్చు.. ఇటు చంద్రబాబు.. అటు పవన్ కళ్యాణ్.. మధ్యలో లోకేష్ కామెంట్లు కావచ్చు.. వారు వ్యవహరించిన తీరు కావచ్చు.. మొత్తంగా చూస్తే కూటమిలో కుంపట్లు రాజుకోవడం ఇప్పట్లో కుదరని పని.. ముగ్గురు మధ్య చాలా అండర్ స్టాండింగ్ ఉందనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు సీఎంగా చంద్రబాబే ఉండాలనే పవన్ కామెంట్ చేసిన తర్వాత.. చంద్రబాబుతో.. టీడీపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో కూడా రంగంలోకి దిగేందుకు పవన్ కళ్యాణ్ మానసికంగా సిద్దమైపోయారనే భావన వ్యక్తమైంది. కానీ ఈ తరహా సఖ్యత మూణ్నాళ్ల ముచ్చటగానే మారునుందా..? అనే చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ అడపా దడపా సీఎం స్థాయిలో కామెంట్లు చేయడం.. టీడీపీ నేతలను.. టీడీపీకి చెందిన మంత్రులను విమర్శించడం పట్ల కొంత కాలంగా టీడీపీలో అసంతృప్తి ఉన్నప్పటికీ.. దాన్ని భూతద్దంలో చూడడం దేనికనే ఉద్దేశ్యంతో సైలెంటుగానే ఉన్నారు. కానీ తిరుపతి తొక్కిసలాట ఘటనలో చంద్రబాబు కామెంట్లకు విరుద్దంగా.. పవన్ కళ్యాణ్ కామెంట్లు చేయడంతో టీడీపీ లీడర్లల్లో కానీ.. కేడర్లో కానీ విపరీతమైన అసంతృప్తి మొదలైందనే చెప్పాలి. ఆ తర్వాత నుంచే లోకేష్ డెప్యూటీ సీఎం అనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అయితే ఇది ఎక్కడకు దారి తీస్తుందా.. ? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న వారు లేకపోలేదు. కారణాలేమైనా.. ప్రస్తుతం కేంద్రం ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సహయ సహకరాలు అందిస్తోంది. కేంద్రం నుంచి వీలైనంత చేయూత లభిస్తోంది కాబట్టే ఏపీలో కాస్తో కూస్తో ఊపిరి తీసుకోగలుగుతున్నామనే విషయాన్ని టీడీపీలోని ఓ వర్గం గుర్తు చేస్తోంది. రాజధానికి, పోలవరానికి, విశాఖ స్టీల్ ప్లాంటుకు.. ఇలా ఆర్థిక సాయమో.. చేయూతో కేంద్రం అందిస్తోంది కాబట్టే.. ప్రజల్లో కూటమి ప్రభుత్వ పాలన మీద సానుకూలత వ్యక్తమవుతోందని అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా వ్యవహరించినా.. జనసేనానితో ఎలాంటి గొడవలు పెట్టుకున్నా.. బీజేపీ సహకారం ఎంత వరకు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. రాష్ట్రంలోని ఈ పరిస్థితిని అడ్వాంటేజీగా తీసుకుని కేంద్రం గేమ్ ఆడడం మొదలు పెడితే.. అసలుకే మోసం రావచ్చనే ఆందోళన వస్తుంది. ఇది అల్టిమేటుగా ప్రత్యర్ధి వైసీపీకి చాలా కలిసి వచ్చే అంశంగా మారుతుందని అంటున్నారు. పైగా నియోజకవర్గాల పునర్ విభజన వంటి కీలక వ్యవహరం ముందు పెట్టుకుని గేమ్స్ ఆడడం మొదలు పెడితే దబిడి దిబిడే అనే ఆందోళన కొందరిలో వ్యక్తమవుతోంది. లోకేషును డెప్యూటీ సీఎంను చేయాలనే డిమాండ్ టీడీపీ వైపు నుంచి మొదలు కావడంతో సోషల్ మీడియాలో టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్టు వ్యవహరం మొదలైంది. ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకోవడం ప్రారంభమైంది. ఇది మరింత ముదిరితే కూటమి పుట్టి మునగడం ఖాయమనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోగానే ఈ తరహా విబేధాలు కావచ్చు.. ఈ తరహా చర్చ రాజకీయంగా ఎంత మాత్రమూ కరెక్ట్ కాదనే వాదన ముందు చూపున్న నేతల నుంచీ వినిపిస్తోంది.
చంద్రబాబు లేదా లోకేష్ ప్రకటన చేయకుంటే కూటమి పార్టీల మధ్య గ్యాప్ ఖాయమేనా..?
దీంతో డెప్యూటీ సీఎం డిమాండ్ ఎపిసోడుకు వీలైనంత త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వివాదానికి.. ఈ చర్చకు ఫుల్ స్టాప్ పడాలంటే.. చంద్రబాబు కానీ.. లోకేష్ కానీ స్పందించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. వివిధ సందర్భాల్లో కూటమికి.. ప్రభుత్వానికి.. ఇబ్బందులు ఎదురువుతున్నాయనే సందర్భంలో పవన్ వెంటనే దాన్ని సరిచేసే ప్రయత్నం చేసేవారని.. ఇప్పుడు చంద్రబాబు.. లోకేష్ కూడా అదే తరహాలో వ్యవహరిస్తే కూటమికి.. రాష్ట్రానికి.. రాజకీయానికి మంచిదని అంటున్నారు.