-
విజయవాడలో నాలుగు గంటలు ఏం చేశాడు?
-
పాస్టర్ ప్రవీణ్ మృతిపై వీడుతున్న సందేహాలు
-
విజయవాడ వెళ్లకముందే ఓసారి రోడ్డు ప్రమాదం
-
బుల్లెట్ హెడ్‌లైట్ బ్లాస్ట్.. ప్రవీణ్ చేతికి గాయాలు
-
గొల్లపూడి పెట్రోలు బంకులో మాట్లాడలేని పరిస్థితి
-
పెట్రోల్ బంకులో సిబ్బందికి చేతితో సైగలు
-
రామవరప్పాడు రింగ్ దగ్గర రెండోసారి యాక్సిడెంట్
-
గమనించిన ట్రాఫిక్ ఎస్‌ఐ, ఆటో డ్రైవర్లు
-
రోడ్డు పక్కన కూర్చోబెట్టిన ట్రాఫిక్ ఎస్‌ఐ సుబ్బారావు
-
ట్రాఫిక్ బూత్ దగ్గరే మూడు గంటలు నిద్రపోయిన పాస్టర్
-
తాగి బైక్ నడపొద్దంటూ పాస్టర్‌కు ఎస్‌ఐ కౌన్సిలింగ్
-
ట్రాఫిక్ ఎస్‌ఐ వారించినా పట్టించుకోకుండా పాస్టర్ ప్రయాణం
-
ఏలూరులో మరో మద్యం బాటిల్ కొన్న పాస్టర్
-
సీసీ దృశ్యాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు.. తెలంగాణలో కూడా హాట్ టాపిక్ గా మారిన పాస్టర్ ప్రవీణ్ మృతి మిస్టరీ క్రమంగా వీడుతోంది. ప్రవీణ్ మరణించినప్పటి నుంచీ వివాదాలు, ఆరోపణలు చుట్టుముట్టాయి. పాస్టర్ ప్రవీణ్‌ది హత్యే అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పోలీసుల ప్రకటనలపైనా కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం కనిపించింది. దీంతో, ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించిన ఆధారాలన్నీ సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే చాలా అంశాలు, సీసీ కెమెరా ఫుటేజీలు సేకరించారు. విజయవాడలో నాలుగు గంటల పాటు ప్రవీణ్ స్టే చేయడం వెనుక కారణమేంటన్నది ఈ ఇష్యూలో మెయిల్ టాపిక్ అయ్యింది. దీంతో, ఆ అనుమానాలు కూడా పోలీసులు నివృత్తి చేశారు.
ఫలితంగా పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో చిక్కుముళ్లన్నీ వీడుతున్నాయి. రాజమహేంద్రవరం చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్టు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవడంతో సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా ప్రవీణ్ ప్రతి కదలికను పోలీసులు గుర్తించారు. దీనికోసం విజయవాడ, రాజమహేంద్రవరం పోలీసులు మొత్తం 300 కెమెరాల ఫుటేజీలను విశ్లేషించారు.
కోదాడలో మద్యం బాటిల్ కొన్న పాస్టర్ :
పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి రాజమండ్రి బయలు దేరి వెళ్లాడు. అదేరోజు మధ్యా హ్నం కోదాడ చేరుకున్నాక.. రహదారి పక్కనే ఉన్న ఓ మద్యం దుకాణంలో మద్యం బాటిల్ కొన్నాడు. దానికోసం ఫక్షన్ పే ద్వారా రూ.650 ట్రాన్స్‌ఫర్ చేశాడు. ఇక, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించడానికి ముందే ప్రవీణ్ మధ్యలో మద్యం తాగినట్టు అనుమానిస్తున్నారు. అలా ముందుకు వెళ్తున్న సమయంలో కంచికచర్ల-పరిటాల మధ్య బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు పాస్టర్ ప్రవీణ్. దీంతో, తన బుల్లెట్ హెడ్‌లైట్ పగిలిపోయింది. సేఫ్టీ రాడ్స్ కూడా వంగిపోయాయి. ప్రవీణ్ చేతులకు గాయాలయ్యా యి.
అయితే, దారిలో వెళ్లే వాహన దారుల సహాయంతో ఎలాగోలా తాను లేచి.. బైక్ లేపి ముందుకు వెళ్లాడు. అక్కడి నుంచి గొల్లపూడి పెట్రోలు బంకుకు చేరుకున్నాడు. సరిగ్గా సాయంత్రం 4.15 నిమిషాలకు పాస్టర్ ప్రవీణ్ గొల్లపూడి పెట్రోల్ బంకుకు చేరుకున్నట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్టు పెట్రోల్ బంక్ సిబ్బంది పోలీసులకు చెప్పారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా పెట్రోల్ బంక్ సిబ్బంది చెప్పింది నిజమే అన్న విషయం అర్థమయ్యింది. పాస్టర్ ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో.. ఎనిమిది లీటర్ల పెట్రోల్ పోయాలంటూ సైగలతోనే చెప్పాడు. పెట్రోల్ బంక్‌కు రాగానే ఎంత పెట్రోల్ పోయమంటారని సిబ్బంది అడిగారు. దీంతో, ప్రవీణ్ ఎనిమిది వేళ్లు చూపించాడు. 800 రూపాయల పెట్రోల్ పోయాలా? అని బంకు సిబ్బంది ప్రశ్నించారు. దీంతో, పాస్టర్ ప్రవీణ్ తల అడ్డంగా ఊపాడు. ఎనిమిది లీటర్లు పెట్రోల్ పోయాలా? అని అడిగితే మాత్రం అవునన్నట్లు తల పైకి కిందికి ఊపాడు పాస్టర్ ప్రవీణ్. పెట్రోల్‌కు అయిన డబ్బులు రూ.872 ఫోన్ పే ద్వారా ట్రాన్స్‌ఫర్ చేశాడు.
అయితే, పెట్రోల్ బంకుకు వచ్చే సరికే పాస్టర్ ప్రవీణ్ చేతులపై కొట్టుకుపోయినట్టు గాయాలు ఉన్నాయని, బుల్లెట్ హెడ్‌లైడ్ కూడా ఊడిపోయి ఉందని బంకు సిబ్బంది తెలిపారు. సాంకేతిక ఆధారాల కోసం పెట్రోల్ బంక్ నుంచి సీసీ కెమెరాల నుంచి ఫుటేజీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడినుంచి పాస్టర్ ప్రవీణ్.. జాతీయ రహదారిపై దుర్గగుడి ఫ్లై ఓవర్, రాజీవ్‌గాంధీ పార్కు, పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ మీదుగా బెంజిసర్కిల్ రెండో ఫ్లైఓవర్ ఎక్కి మహానాడు జంక్షన్‌కు చేరుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
విజయవాడలో ప్రవీణ్ పాస్టర్ నాలుగు గంటలు ఏం చేశాడు? :
ప్రవీణ్ పాస్టర్ చనిపోక ముందు విజయవాడలో గడిపిన నాలుగు గంటల సమయంలో ఏం జరిగిందనేదే ఇప్పుడు హాట్ హాట్‌గా చర్చనీయాంశం కావడంతో ఆ ప్రశ్నకు సమాధానం కోసం పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఆధారాలను సేకరించారు. ఆ దారిలో ఉన్న అన్ని సీసీ కెమెరాల్లో ప్రవీణ్ పాస్టర్ బుల్లెట్‌పై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. అయితే, మహానాడు కూడలి దాటిన తర్వాత రామవరప్పాడు రింగ్ దగ్గర సీసీ కెమెరాల్లో చూస్తే.. ప్రవీణ్ పోలీసులకు కనిపించలేదు. సరిగ్గా సాయంత్రం 5.13 గంటలకు పాస్టర్ ప్రవీణ్ మహానాడు కూడలి దాటినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. దీంతో, మహానాడు కూడలి నుంచి రామవరప్పాడు రింగ్ వచ్చే మధ్యలోనే ఏదో జరిగిందని పోలీసులు అనుమానించారు. దీంతో, దర్యాప్తు జరుగుతున్న కొద్దీ అసలు విషయాలన్నీ బయటపడ్డాయి. రామవరప్పాడు రింగ్ రాకముందే పది మీటర్ల దూరంలో వోక్స్ వ్యాగన్ షోరూమ్ ఎదురుగా బుల్లెట్ పైనుంచి పాస్టర్ ప్రవీణ్ పడిపోయాడు. అక్కడ సమీపంలో ఉన్న ఆటో డ్రైవర్లు రామవరప్పాడు రింగ్‌లో డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ సుబ్బారావుకు విషయం చెప్పారు. దీంతో, ట్రాఫిక్ ఎస్‌ఐ సుబ్బారావు.. సంఘటనా స్థలానికి చేరుకొని పాస్టర్ ప్రవీణ్‌ను పైకి లేపాడు. అక్కడున్న రెయిలింగ్ వద్ద కాసేపు కూర్చో బెట్టారు. పాస్టర్ ప్రవీణ్ చేతులకు గాయాలు కావడం, బుల్లెట్ బైక్ హెడ్‌లైట్ పగిలిపోయి ఉండటం, హెల్మెట్‌కు సొట్ట పడటం వంటివి గమనించిన ఎస్‌ఐ సుబ్బారావు ఆ ఫోటోలు తీశారు. కొద్ది సేపయ్యాక పాస్టర్‌ను నెమ్మదిగా నడిపించుకుంటూ ఎస్‌ఐ సుబ్బారావు.. రింగ్ దగ్గరికి తీసుకొచ్చాడు. పాస్టర్ బుల్లెట్ బైక్‌ను ఆటోడ్రైవర్లు తోసుకుంటూ రింగ్ దగ్గర ఉన్న ట్రాఫిక్ బూత్‌కు తీసుకొచ్చారు. అక్కడ పాస్టర్ ప్రవీణ్ ముఖం కడుక్కోవడానికి ట్రాఫిక్ ఎస్‌ఐ సుబ్బారావు నీళ్లు ఇచ్చారు. అప్పుడు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ప్రకారం సాయంత్రం 5.30 గంటలు అయ్యింది. అప్పటికే ఫుల్‌గా మద్యం మత్తులో ఉన్న పాస్టర్ ప్రవీణ్.. రామవరప్పాడు రింగ్ ట్రాఫిక్ బూత్ ఎదురుగా ఉన్న గడ్డిలో ఒళ్లు తెలియకుండా నిద్రపోయాడు. సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8.20 గంటల వరకు పాస్టర్ ప్రవీణ్ రోడ్డుపక్కన గడ్డిలో నిద్ర పోయాడు. ప్రవీణ్ నిద్ర లేచాక అక్కడే విధుల్లో ఉన్న ఎస్‌ఐ సుబ్బారావు గమనించి.. అతన్ని దగ్గర్లో ఉన్న టీ స్టాల్ దగ్గరికి తీసుకెళ్లి టీ తాగించారు. మద్యం మత్తులో బైక్ నడపడం నేరమని, ఇలాంటి స్థితిలో బైక్ నడప వద్దని పాస్టర్‌కు ఎస్‌ఐ కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ, పాస్టర్ ప్రవీణ్ మాత్రం బుల్లెట్ స్టార్ట్ చేసుకొని ఏలూరు వైపు బయలు దేరి వెళ్లాడు. ఆ సమయంలో ట్రాఫిక్ ఎస్‌ఐ సుబ్బారావు వద్దని వారించినా.. పాస్టర్ ప్రవీణ్ వినలేదు. రాత్రి సరిగ్గా 8.47 నిమిషాలకు పాస్టర్ ప్రవీణ్.. రామవరప్పాడు రింగ్ నుంచి ఏలూరుకు బయలు దేరి వెళ్లాడు.
ట్రాఫిక్ ఎస్‌ఐతో కలిసి టీ షాపు దగ్గరికి వెళ్లడం, టీ తాగడం, తర్వాత తిరిగి ట్రాఫిక్ బూత్ దగ్గరికి రావడం వంటి దృశ్యాలన్నీ అక్కడే ఉన్న ఓ హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అయితే, అక్కడి నుంచి అలా ముందుకు వెళ్లిన పాస్టర్ ప్రవీణ్.. టోల్ గేట్లు అన్నీ దాటిన తర్వాత ఏలూరులో మరోసారి టానిక్ వైన్స్‌లో మద్యం కొన్నాడు. ఆ మద్యం కోసం రూ.350 ఫోన్ పే ద్వారా చెల్లించాడు. అక్కడ వైన్‌షాపులో రికార్డ్ అయిన సీసీ ఫుటేజీ దృశ్యాలు కూడా పోలీసులు సేకరించారు. ఈ వ్యవహారంలో అన్ని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకొని, విచారణ కొనసాగిస్తున్నారు.