27 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

భారత్ నిర్ణయాలు…పాకిస్థాన్ పై ప్రభావం

పహెల్‌గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్‌ సమావేశమై కీలక చర్చలు జరిపింది. ఈ భేటీలో సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేలా ఐదు నిర్ణయాలు తీసుకుంది.

  1. 1960 నాటి సింధూ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయడం
  1. వాఘా-అటారీ సరిహద్దును వెంటనే మూసివేయడం
  1. భారత్‌లోకి పాకిస్థాన్‌ పౌరులకు నో ఎంట్రీ.. భారత్‌లో ఇప్పటికే ఉన్న పాక్‌ పౌరులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలి.
  1. భారత్‌లోని పాకిస్థాన్ హైకమిషన్‌లో ఉన్న ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీ సైనిక సలహాదారులు దేశం విడిచి వెళ్లిపోవాలి. అలాగే ఇస్లామాబాద్‌లో ఉన్న భారత్‌ సలహాదారులను వెనక్కి పిలిపించడం.
  1. భారత్‌లోని పాక్ హై కమిషన్లలో ఉన్న ఇమ్మిగ్రేషన్ అధికారుల సంఖ్యను 55 నుంచి 30కి తగ్గించాలి.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలు ఇప్పుడు పాక్‌పై ప్రభావం చూపే అవకాశం ఖచ్చితంగా ఉంది. దౌత్యాధికారుల విషయం పక్కన పెడితే.. సింధూజలాల ఒప్పందం ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచ బ్యాంక్‌ 1960 ఇరు దేశాల మధ్య కుదిర్చిన ఒప్పందం. ఆ సమయంలో ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ, పాకిస్థాన్ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సింధు ఉప నదుల్లో తూర్పున పారే బియాస్, సట్లెజ్, రావి నదులపై భారత్‌కు హక్కులు లభించాయి. ఇక పశ్చిమ ఉప నదులైన జీలం, చీనాబ్‌లపై పాకిస్థాన్‌కు హక్కులు దక్కాయి. ఈ విషయంలో రెండు దేశాల సహాకారం కోసం పర్మినెంట్ ఇండస్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. 1948 ఏప్రిల్ 1న భారతదేశం నీటిని ఆపివేసింది. దీని వల్ల పాకిస్థాన్ పంజాబ్‌లోని 17 లక్షల ఎకరాల భూమి నీరు లేక బీడుగా మారింది. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని పూర్తిగా రద్దు చేయడం ద్వారా భారతదేశం పాకిస్థాన్‌ను కుంగదీసింది. నిజానికి, పాకిస్థాన్‌లోని పంజాబ్, సింధ్ ప్రాంతాలు వాటి నీటి అవసరాలను తీర్చుకోవడానికి చినాబ్, జీలం, సింధు వంటి నదుల నీటిపై పూర్తిగా ఆధారపడి ఉన్నాయి.

గతంలో ఎన్ని ఉద్రిక్తతలు ఉన్నా.. యుద్ధాలు జరిగినా ఈ ఒప్పందం జోలికి ఎవరు వెళ్లలేదు.  కేంద్రం ఈసారి పాక్‌ తీరును ఉపేక్షించే స్థితిలో కనిపించడం లేదు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే పాక్‌కు తీవ్ర నష్టం తప్పదు. ఎందుకంటే ఈ నదులు భారత్‌ వైపు నుంచి పాక్‌కు వెళుతున్నాయి. రావి, బియాస్ నదీ జలాల విడుదలపై భారత్‌ ఆంక్షలు విధిస్తే సింద్‌ రాష్ట్రంలో తీవ్రస్థాయిలో నీటి ఎద్దడి ఏర్పడుతుంది. వ్యవసాయంరంగంపై  ప్రభావం పడుతుంది. కరాచీ నగరానికి తాగునీటి కొరత ఏర్పడే ముప్పు ఉంది.

సింద్‌ రాష్ట్రంలో ఇప్పటికే అసంతృప్తి ఉంది. పాక్‌ ప్రభుత్వం పంజాబ్‌ క్షేమం తప్పితే సింధ్‌ సమస్యలు పరిష్కరించటం లేదని ఆ ప్రాంత ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. నదీజలాల సమస్య తలెత్తితే పాక్ ప్రభుత్వంపై ప్రభావం పడుతుంది.

అటారీ- వాఘా బార్డర్ చెక్‌పోస్ట్‌ మూసివేత ప్రభావం సిక్కుల మీద అధికంగా ఉంటుంది. పాకిస్థాన్‌లోని సిక్కు పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికుల పర్యటనలు రద్దయ్యాయి. ఈ బోర్డర్‌ మూసివేత ద్వారా ఖలిస్థాన్‌ అనుకూలవాదుల కుట్రలు భగ్నం అయ్యే అవకాశం ఉంది. భారత్‌ నుంచి వెళ్లే యాత్రికులకు ఇటీవలి కాలంలో ఖలిస్థాన్‌ ఉద్యమంపై అక్కడి గురుద్వారాల్లో ప్రభోదనలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

పాకిస్థాన్‌లో పెరుగుతున్న నిత్యావసరాల ధరలు తగ్గాలంటే భారత్‌తో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవాలని ఆ దేశ ప్రజలు పదే పదే డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే వాణిజ్య సంబంధాలు  నిలిచిపోగా…తాజాగా బోర్డర్‌ మూసివేయటంతో పాక్‌ ప్రజలు ఊసురుమంటున్నారు. పాకిస్థాన్‌ ప్రభుత్వం చర్చలు ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com