- ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల ప్రభావం
- మన కరెన్సీ ఆల్ టైమ్ లో.. లోకి
- ఇండియన్ కరెన్సీ వాల్యూ 0.6 శాతం తగ్గుదల
- త్వరలోనే డాలర్ విలువ రూ.100?
- ఇప్పటికే బంగారం, పెట్రొ ఉత్పత్తుల ధరల మోత
- రేపో..మాపో..పదిగ్రాముల బంగారం లక్ష?
- సీఎన్జీ, డీజిల్ ధరల మోత?
- ఆరు నుంచి8 వారాలు ఇదే పరిస్థితి..
- అప్రమత్తమైన ఆర్బీఐ
రూపాయి పతనం దారుణంగా కొనసాగుతోంది. ఈరోజు ఈ మధ్యకాలంలోనే ఎన్నడూ చూడనంత పతనం చవి చూసింది. దాదాపు 0.6 శాతం తగ్గుదలతో ఆల్ టైమ్ లో 87 కుచేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా విధిస్తున్న టారిఫ్ ల ప్రభావం, అంతర్జాతీయంగా డాలర్ మారకం అంతకంతకూ పెరుగుతుండటంతో మన రూపాయి విలువ అంతకంతకూ దిగజారుతోంది. అమెరికా టారిఫ్ ల విధింపుతో అంతర్జాతీయ విఫణిలో సరికొత్త ట్రేడ్ వార్ మొదలవుతుందన్న భయం ఆసియన్ మార్కెట్లను భయపెడతోంది. అమెరికా డాలర్ దెబ్బకు మన రూపాయి చైనా యువాన్ ఇతర ఆసియన్ కరెన్సీలు గజగజవణుకుతున్నాయి. డాలర్ వాల్యూ అంతకంతకూ పెరుగుతుండటంతో ఇటు పెట్రోల్ డీజిల్ ధరలతో పాటు ఇతర అంతర్జాతీయ ప్రోడక్ట్స్ రేట్లు తారాజువ్వలో ఎగసిపడతాయన్న భయం వెంటాడుతోంది.
రూపాయి పతనం ఇలాగే కొనసాగితే మనదేశంలో మధ్యతరగతి పౌరుడి బతుకు పతనం మొదలవుతుంది. అంతర్జాతీయ కరెన్సీ మారకం విలువ పెరిగితే మన దగ్గర ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుంది. బంగారం నుంచి పెట్రో ఉత్పత్తుల వరకూ అన్నీ ధరలూ ఆకాశాన్నంటుతాయి. ఇప్పటికే పది గ్రాముల బంగారం ధర సామాన్యుడు, మధ్యతరగతి పౌరుడు కొనే స్థితిలో లేదు. 87 వేలు దాటేసింది. ఇప్పుడు రూపాయి పతనం మరింత కొనసాగితే ఇక నిత్యావసరాల నుంచి ఖరీదైన బంగారం లాంటి ధరల వరకూ అన్నీ అందనంత ఎత్తుకు చేరుకుంటాయి. ఇప్పటికే పది గ్రాముల బంగారం లక్ష రూపాయిలకు పెరిగినా ఆశ్చర్యం లేదు. అలాగే పెట్రో రేట్లు ఎప్పుడో వంద దాటేశాయి. ఇక ఇప్పుడు డీజిల్, సీఎన్జీ ధరలు కూడా పెరిగితే ఇక ఆ ప్రభావం ప్రజల జీవన ప్రమాణాలపై దారుణంగా పడబోతోంది.
ఈ పతనం ఎందాక?
అంతర్జాతీయ విఫణిలో డాలర్ జోరు చూస్తుంటే డాలర్ మారకం విలువ వంద రూపాయలు అవుతుందేమోనన్న భయం భారతీయులని భయపెడుతోంది.పైగా ఈ పతనం మరో ఆరునుంచి 8 వారాలు కొనసాగే అవకాశం ఉంది. అంటే నెలాన్నర పాటూ ఇదే ధోరణి కొనసాగితే మన పరిస్థితి అధోగతే..
పతనానికి కారణాలేంటి?
అమెరికా అధ్యక్షుడు పీఠం ఎక్కిన దగ్గర్నుంచి ప్రపంచ దేశాలను తన దారిలోకి తెచ్చుకోవాలని తపన పడుతున్నాడు. అందులో భాగంగానే సామ, దాన భేద, దండోపాయాలను ప్రయోగిస్తున్నాడు. తనను కాదన్న వారిపై టారిఫ్ ల కొరడా ఝళిపిస్తున్నాడు. మెక్సికో, కెనడా దేశాలపై మొదట టారిఫ్‌ల అస్త్రం ప్రయోగించాడు. గతవారంలో ట్రంప్ సంతకం చేసిన మూడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇప్పుడు ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నాయి.మెక్సికో, కెనడా దేశాలపై 25 శాతం టారిఫ్ లు విధిస్తున్నట్లు అలాగే చైనాపై పది శాతం టారిఫ్ లు విధిస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మూడు ఆదేశాల దెబ్బకు అంతర్జాతీయ విఫణిలో డాలర్ బలపడిపోయింది.డాలర్ బలపడిన కొద్దీ ఆసియా కరెన్సీలు విలవిలలాడుతూ వచ్చాయి.మొదట దెబ్బ పడింది చైనా కరెన్సీ యువాన్ లపై.. చైనా, భారత్ ల కరెన్సీలు ఇంటర్నేషనల్ మార్కెట్ లో దాదాపు ఒకే డైరక్షన్ లో నడుస్తుంటాయి. అందుకే భారత్ కరెన్సీ పైనా డాలర్ ఎఫెక్ట్ పడింది.ప్రపంచంలో టాప్ ఆరు కరెన్సీలకన్నా అమెరికా డాలర్ 0.3 శాతం నుంచి 109.8 శాతానికి చేరుకుంది. ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం వికృత పరిస్థితులను సృష్టిస్తుందన్న అంచనాలు నిజమవుతున్నాయని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లే కామెంట్ చేసింది. ఈ ప్రభావంతో ఆసియా దేశాలు అత్యధికధరల పెరుగుదలను చవిచూడబోతున్నాయి. అదీకాక ఏడు ఆసియా మార్కెట్లు డాలర్ దెబ్బకు కకా వికలమవుతున్నాయి. అదే మన రూపాయి బక్క చిక్కడానికి కారణమవుతోంది. ఇది రూపాయి పతనంతోనే ఆగదు. మన స్టాక్ మార్కెట్లు కూడా కుప్పకూలుతున్నాయి. 2025 యూనియన్ బడ్జెట్ తో కలిగిన ఒక రిలీఫ్ ఫీలింగ్ మొత్తం అమెరికా టారిఫ్ ల దెబ్బతో చెరిగిపోయిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మన దేశీయ మార్కెట్లు కూడా దారుణంగా దెబ్బ తింటున్నాయి. బడ్జెట్ రోజునే స్టాక్ మార్కెట్లు కుప్పకూలి నష్టాల్లోకి జారుకోవడం మనం చూశాం.మన ఫైనాన్షియల్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విదేశీ ఇన్వెస్టర్లు కూడా ఈ దెబ్బకు జారుకునే అవకాశముంది.